స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, లైగర్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ బుధవారం పోలీసులను ఆశ్రయించారు. లైగర్ డిస్ట్రిబ్యూటర్లు అయిన వరంగల్ శ్రీను, శోభన్‌లపై ఆయన కేసు పెట్టారు. శ్రీను, శోభన్‌ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు! వారినుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందని, ముందస్తు భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు పోలీసులు పూరీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. గురువారం ఆయన ఇంటి దగ్గర కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.
అంతకు క్రితం పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు వార్నింగ్ ఇస్తున్న ఓ ఆడియో వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో పూరీ డిస్ట్రిబ్యూటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ నేను ఎవ్వరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నష్టపోయారన్న కారణంతోనే డబ్బులు తిరిగి ఇస్తున్నా. మేము ఇప్పటికే బయ్యర్స్‌తో మాట్లాడాం. ఒక అమౌంట్ ఇస్తామని చెప్పాం. వాళ్లు ఒప్పుకున్నారు. ఒక నెల సమయం అడిగాను. నాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. అవి వచ్చాక ఇస్తా. మాట ఇచ్చిన తర్వాత కూడా ఓవర్ యాక్షన్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధికాదు.
పరువు కోసం డబ్బులు తిరిగి ఇస్తున్నా. నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను’’ అని స్పష్టం చేశారు. కాగా, విజయ్ దేవర కొండ, అనన్య పాండే హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. ఛార్మీ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న థియేటర్లలోకి వచ్చింది. అయితే, అంచనాలను తారుమారు చేస్తూ సినిమా ప్లాప్‌గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇస్తానని మాటిచ్చారు.