ఈ మధ్యకాలంలో యూట్యూబ్ అనేది సెలబ్రిటీలుగా మారేందుకు మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. యూట్యూబ్ లో సక్సెస్ అయితే అంతే ఇక.. వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదనేది వాస్తవం. యూట్యూబ్ ద్వారా ఫేమ్ పొంది.. బిగ్ బాస్ లో పాల్గొని సినిమా ఛాన్సులు రాబట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ యూట్యూబ్ అనేది ఎంత బాగా ఫేమ్ తీసుకొస్తుందో.. మనం పోస్ట్ చేసే వీడియోలలో ఏదైనా తప్పు జరిగిందంటే మాత్రం తీవ్రస్థాయిలో ట్రోల్స్ తీసుకొస్తుంది.
తాజాగా అలాంటి వివాదంలోనే ఇరుక్కుంది 7arts ఫేమ్ సరయు. యూట్యూబ్ ప్రేక్షకులకు సరయు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 7arts ఛానల్ బోల్డ్ కంటెంట్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. అయితే.. బోల్డ్ నెస్ పేరుతో పచ్చి బూతులు మాట్లాడుతున్నారంటూ అప్పట్లో 7arts టీమ్ పై రచ్చ కూడా జరిగింది.
తాజాగా హోటల్ వ్యాపారంలోకి దిగి సరయు మరో వివాదంలో చిక్కున్నట్లు తెలుస్తుంది. ఇటీవల తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర దృశ్యాలున్నాయనే ఆరోపణలతో.. సరయుపై చర్యలు తీసుకోవాలంటూ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. అనంతరం ఆ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు చేపూరి ఆశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హోటల్ ప్రమోషన్స్ లో భాగంగా హిందువులను కించపరిచారని.. ఆ పాటలో తలకు గణపతి బప్పా మోరియా బ్యాండ్ ధరించి మద్యం సేవించారని.. ఆ విధంగా హోటల్ ప్రమోషన్స్ చేయడం సరైన పద్ధతి కాదని వారు పేర్కొన్నారు. మరి ఈ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.