పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ కలల రాకుమారిగా నటించిన హీరోయిన్ ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. తన ప్రొడక్షన్ హౌస్ పనులు చూసుకుంటూ గడుపుతున్నారు.
శ్రీకాంత్ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా 1990లలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ఈ సినిమాలో రవళి, దీప్తి భత్నగర్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తరచూ ఓ అమ్మాయి గురించి కలలు కంటూ ఉంటాడు. ఆ అమ్మాయి అతడి కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కలల రాకుమారే ‘ దీప్తి భత్నగర్’. సినిమాలోనే నిజ జీవితంలోనూ ఆమె ఎంతో మంది కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయారు. దీప్తికి ఇది తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.
అవకాశాలు కూడా బానే వచ్చాయి. దీప్తి తెలుగులో పలు హిట్టు సినిమాల్లో నటించారు. 2002లో వచ్చిన ‘కొండవీటి సింహాసనం’ సినిమా తర్వాత తెలుగు తెరకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె బాలీవుడ్ చిత్ర దర్శకుడు రణ్‌దీప్ ఆర్యను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. పెళ్లి తర్వాత కూడా కొన్నేళ్ల పాటు ఆమె సినిమాల్లో కొనసాగారు. 2007లో వచ్చిన ‘రాకిలిపట్టు’ అనే మలయాళ సినిమా తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. సినిమాల్లో ఉండగానే ఆమె ‘దీప్తి భత్నగర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా పలు టీవీ షోలను నిర్మించారు. ఇప్పటికీ ఆ సంస్థ ద్వారా షోలను నిర్మిస్తూ ఉన్నారు.
దీప్తి సోషల్ మీడియా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆమెకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఖాతాలు ఉన్నాయి. వాటిలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. దీప్తికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే విదేశాల్లో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అందుకే ట్రావెలింగ్ మీద ఓ షోను కూడా చేశారు. అది ప్రముఖ ఛానళ్లలో ప్రసారం కూడా అయింది. ఇక, దాదాపు 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2022లో రెండోసారి వెండితెరపై తలుక్కుమన్నారు. పెళ్లిసందDలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.