రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రులు, నటుడు పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో సమావేశంలో పవన్‌కళ్యాణ్ మాట్లాడారు. మంత్రులు, వైసీపీ కార్యకర్తలు, నటులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన ఇంట్లో మహిళ గురించి, తల్లి, భార్య, అక్కాచెల్లెళ్ల గురించి వైసీపీ వాళ్లు మాట్లాడినా.. వైసీపీ సాధారణ కార్యకర్త ఇంట్లో మహిళల నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి వరకు ఎవరినీ కూడా పల్లెత్తు మాట అనను అని అన్నారు.
మహిళలను గౌరవించడం తన సంస్కారం అన్నారు. ఈ విషయమై వైఎస్ భారతికి మాట ఇస్తున్నట్లు పవన్ తెలిపారు. పవన్ వ్యక్తిగత జీవితంపై, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పనికి పోసాని కృష్ణమురళీ అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఈవిధంగా స్పందించడంపై నెటిజన్లు హర్షిస్తున్నారు. చాలా ఉన్నతంగా, హూందాగా స్పందించారని సోషల్‌మీడియాలో ప్రశంసిస్తున్నారు.