ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ షోల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ప్రారంభమైన అలీతో సరదాగా నుంచి గతేడాది వచ్చి టాక్ షోలకు అమ్మ మొగుడు అయ్యిందని బాలయ్య బాబు చెప్పే.. అన్ స్టాపబుల్ వరకు అన్నింటికి ఎంతో ఆదరణ లభించింది, లభిస్తూనే ఉంది. అయితే ఈ మధ్య టాక్ షోలకు చోటా మోటా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బడా బడా హీరోలు, రాజకీయ నాయకులు సైతం రావడం చూస్తూనే ఉన్నాం. అదే క్రమంలో కొన్ని షోలకు సంబంధించి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇదే అంశంపై కమెడియన్ అలీ కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ తన షోకి రాబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చారు.
ఇటీవలే బాలయ్య అన్ స్టాపబుల్ షోకి నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత బాగా వినిపించిన వార్త బాలయ్య షోకి పవన్ కల్యాణ్ రాబోతున్నారనేది. ఆ వార్తల గురించి పక్కన పెడితే.. అలీతో సరదాగా షోకి మాత్రం పవన్ కల్యాణ్ రాబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ ఈ అంశంపై స్పందించారు. మీ షోకి కల్యాణ్ గారు ఎప్పుడు రాబోతున్నారు అని అడగ్గా.. “ఆయన ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు. కచ్చితంగా మా షోకి వస్తారు. వస్తానని చెప్పారు. త్వరలోనే మా షోకి కల్యాణ్ గారు వస్తారు” అంటూ అలీ కుండబద్దలు కొట్టేశారు. వేరే షోల గురించి పక్కన పెడితే.. అలీతో సరదాగా షోకి మాత్రం పవన్ కల్యాణ్ గెస్ట్ గా రాబోతున్నట్లు వెల్లడించారు.
పవన్ కల్యాణ్- అలీ రిలేషన్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద వాళ్లిద్దరి కామెడీ టైమింగ్, బాండింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. పవన్ చేసిన ఎన్నో సినిమాల్లో అలీకి ప్రత్యేకంగా ఓ పాత్ర ఉండేది. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారి మధ్య బంధం కాస్త చెడిందంటూ వార్తలు చాలానే వచ్చాయి. ఎందుకంటే రాజకీయంగా ఇద్దరూ వేరు వేరు పార్టీలు కావడంతో అలాంటి అభిప్రాయాలు చాలా వచ్చాయి. వాటిపై ఇద్దరూ ఓపెన్‌గా స్పందించింది లేదు. ఇప్పటికీ తాము మంచి మిత్రులమే అని చెబుతూ ఉంటారు. తాజాగా అలీకి ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవిని కట్టబెట్టింది. అటు రాజకీయంగా పవన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ అన్ని పరిణామాల దృష్ట్యా అలీ షోకి పవన్ కల్యాణ్ వస్తే.. అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? అందుకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారు? ఒకవేళ పవన్ ఏపీ ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తే అలీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో బాగా వినిపిస్తున్నాయి.
Kalyan coming to Unstoppable and Ali tho saradaga talk shows! pic.twitter.com/5cwBxasJ3M
— Pawanfied (@Only_PSPK) October 28, 2022