గత కొన్ని రోజులుగా టెన్షన్ వాతావరణం సృష్టించిన మా ఎలక్షన్స్ కి ఈ రోజు పులిస్టాప్ పడబోతుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్లను పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మా ఎన్నికలు సినీ పరిశ్రమలో మాటల యుద్దం నడిచింది. ప్రస్తుతం మాలో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా.. 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం సినీ పెద్దలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓటు వినియోగించుకున్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత హడావిడి అవసరం లేదు. ఎవరికి ఓటు వేస్తామనేది సీక్రెట్ అని.. అయితే ఈ స్థాయిలో ఎన్నికలు జరగడం ఎప్పుడు చూడలేదు. సినిమా చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాలి. తిప్పికొడితే 900 ఓట్లు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ చీలడమనే ప్రశ్నే లేదు. వ్యక్తిగత దూషణలు అనవసరం. మోహన్ బాబు, చిరంజీవి ఎప్పటికీ మంచి స్నేహితులే అని అన్నారు పవన్.