పవిత్రా లోకేష్.. మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు..
సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్రా లోకేష్‌లు కలిసి నటిస్తోన్న చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా వీరిద్దరి నిజ జీవితానికి సంబంధించిన ఘటనలతో పోలి ఉండటంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఆసక్తి మొదలైఇంది. దీనికి తగ్గట్టే ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు.. సినిమా మీద అంచనాలు పెంచాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మించారు. ‘మళ్ళీ పెళ్లి’ ఈనె 26న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా నరేష్-పవిత్రా లోకేష్ ఇద్దరూ రొమాంటిక్ డ్యాన్స్‌తో రచ్చ చేశారు. ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్రా లోకేష్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం, నరేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఓ వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకోవడం.. అది కూడా 50 ఏళ్ల పైబడ్డ వయసులో అంటే దాన్ని.. చాలా తప్పుగా చూస్తారు. ఇది ఒక్కటే కాదు మన సమాజంలో చాలా నిబంధనలు ఉంటాయి. అయితే సమాజంలో ఎవరు ఎవరినీ సరిచేయలేరు. ఎవరి ఆలోచన, అభిప్రాయాలతో వాళ్లు ముందుకు సాగుతారు. మా వరకు వస్తే.. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. మరీ ముఖ్యంగా నా విషయంలో.. కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని నన్ను చాలా తప్పుగా చూపించారు. నా వ్యక్తిత్వాన్ని కించ పరిచి.. నా కెరీర్‌పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటం అంటే మాటలు కాదు. నేను ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేదాన్ని.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి. కానీ నేను వాటిని తట్టుకుని.. ఇలా మీముందుకు రాగాలిగాను అంటే.. అందుకు కారణం నరేష్.. నా వెనుక బలంగా నిలబడ్డారు. నేను ఉన్నానని నాకు ధైర్యం చెప్పారు. దేనికీ భయపడలేదు. నేను ఒక్క అడుగు వెనక్కి వేసినా పరిస్థితి దారుణంగా ఉండేది. నరేష్ చాలా సపోర్ట్‌గా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు.
ఇక నరేష్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన ఎంత సీరియస్ విషయాన్ని అయినా చాలా లైట్‌గా తీసుకుంటారు. అయితే, ఆ పనికి ఏం కావాలో దాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని చేస్తారు. ఆ లక్షణం నాలో లేదు. నేను చిన్న చిన్న విషయాలని కూడా సీరియస్‌గా తీసుకుంటాను. నరేష్ ఈరోజు గురించే ఆలోచిస్తారు. ఈరోజు సంతోషంగా ఉన్నామా లేదా అన్నది మాత్రమే ఆలోచిస్తారు. రేపు ఎలా ఉంటుందో తెలీదు.. రానీ చూసుకుందామంటారు. ఆయనలోని ఈ లక్షణాన్ని నేను కూడా నేర్చుకున్నాను. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. నరేష్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకేం కావాలి. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు
మళ్లీ పెళ్లి సినిమాను బయోపిక్ అనుకోవచ్చా అన్న ప్రశ్నకు పవిత్రా లోకేష్ స్పందిస్తూ.. ‘‘‘బయోపిక్ అనేది చాలా పెద్ద పదం. ‘మళ్ళీ పెళ్లి’ కథ సమాజానికి అద్దం పడుతుంది. ఈ సినిమాలో చూపించిన లాంటి పరిస్థితులు, ఆలోచనలు సమాజంలో ఉన్నాయి. ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు’’ అని చెప్పుకొచ్చారు. ఎం.ఎస్. రాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు నరేష్, తాను కలిసి చేస్తేనే ఇది బాగుంటుందని ఆయన అన్నారని.. తమ ఇద్దరికీ కథ నచ్చి సినిమా చేశామని చెప్పారు. ఇది కల్పిత కథా లేదంటే యదార్థ సంఘటనలతో తెరకెక్కిందా అనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేనని.. సినిమా చూస్తే తెలుస్తుందని.. తాము ఈ సినిమా ద్వారా ఎవ్వరిని టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. మరి పవిత్రా లోకేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.