రెండు రోజుల క్రితం ఆమె మెట్లు దిగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాలు జారింది. దీంతో మెట్లపై నుంచి కిందకు జారిపడ్డారు. దీంతో ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ప్రముఖ సినీ నటుడు ఖజాన్ ఖాన్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. ఈ సంఘటన మరువక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియన్ నటి పార్క్ సూ రియాన్ చనిపోయారు. మెట్లపైనుంచి కిందపడి ఆమె మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్క్ సూ రియాన్ 2018లో కొరియన్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. జేటీబీసీ డ్రామా స్నో డ్రాప్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. స్నో డ్రాప్‌లో నటనకు గాను ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
జూన్ 11న ఆమె మెట్లు దిగుతుండగా జారి కిందపడ్డారు. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. పార్క్ సూ రియాన్‌కు బ్రెయిన్ డెడ్ అయిందని తేల్చారు. కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. ఆమె ఇక బతకదని భావించిన కుటుంబసభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు. ఇక, పార్క్ సూ మరణంపై కొరియన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణంపై తమ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.