సంచలనాత్మక మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య, నటి పల్లవి జోషికి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ‘ది వ్యాక్సిన్ వార్‘ షూటింగ్ లో ఆమె గాయపడ్డారు. ఈ సినిమాకు సంబంధించి ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. వాహనం అదుపు తప్పి.. ఆమెను ఢీకొంది. వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఆమెను ఆసుప్రతికి తరలించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు వివేక్ గతంలో ప్రకటించిన సంగతి విదితమే.
వివేక్ అగ్నిహోత్రి పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ’ది వ్యాక్సిన్ వార్‘. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకంపై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. సోమవారం ఓ సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా.. వాహనం అదుపు తప్పి.. పల్లవి జోషిని ఢీ కొట్టిందని..సెట్స్ లో ఉన్న వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.
చైల్ఢ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన పల్లవి జోషి.. ఆ తర్వాత మరాఠి, మలయాళ చిత్రాల్లో నటించారు. ఇన్సాఫ్ కీ ఆవాజ్ (తెలుగు ప్రతిధ్వనికి రీమేక్), దాత, అంధ్ యుధ్, సౌదాగర్, తలాష్, ఇన్సానియత్, మలయాళ చిత్రం తీర్ధం వంటి చిత్రాల్లో నటించారు. వెండితెరపైనే కాకుండా బుల్లి తెరలోనూ మెరిశారు. టెలివిజన్ షోలతో పాటు జీ మరాఠిలో నిర్వహించిన సరిగమప లిటిల్ ఛాంప్స్ కు హోస్ట్ గా కూడా వ్యవహరించారు. 1997లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని మనువాడారు. వీరికి ఇద్దరు కుమారులు. ది కాశ్మీర్ ఫైల్స్ కూడా ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. కాగా, ఈ సినిమాను హిందీ, ఇంగ్లీష్, తెలుగుతో కలిపి 11 భాషల్లో విడుదల చేయనున్నారు.