ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ ధరల వివాదం పై సీఎం జగన్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు మరోసారి సమావేశం అయ్యేందుకు రంగం సిద్ధమైంది. గత నెలలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే సీఎం జగన్ తో చర్చించి.. ‘టికెట్ ధరల విషయమై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక రాగానే మరోసారి సమావేశం అవుతామని’ చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏపీ మంత్రి పేర్ని నాని అధ్యక్షతన నియమించిన కమిటీ నివేదిక సిద్ధం చేశారు. కాబట్టి గురువారం సీఎం జగన్ తో భేటీ కానున్న సినీ ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సీఎంతో భేటీలో చిరంజీవి, నాగార్జున, డీవీవీ దానయ్య, నిర్మాత వంశీలతో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబులు పాల్గొంటున్నారని సమాచారం. అయితే.. గురువారం జరిగే సమావేశంలో సీఎం జగన్ సినిమా టికెట్ ధరల విషయాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మంత్రి పేర్ని నాని కమిటీ సిద్ధం చేసిన నివేదికలో.. B, C కేంద్రాలలో కనీసం టికెట్ ధరలు రూ.40 – 45 వరకు పెంచాలని సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే.. ఈ భేటీకి ఎన్టీఆర్, మహేశ్ లను ఆహ్వానించడం పై రాజకీయ వ్యూహం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. అలాగే ఎన్టీఆర్ నటించిన RRR సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మరి సీఎంతో ఎన్టీఆర్ సమావేశమయ్యేలా చూడటం, ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ పేరు విజయవాడ జిల్లాకు ప్రకటించడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా చిరంజీవి బృందంలో భాగమై సీఎంతో భేటీ వెనుక పెద్ద ప్లానే ఉందని సమాచారం. మరోవైపు జగన్ తో సమావేశం పర్సనల్ అని మంచు విష్ణు చెప్పడంతో.. మంచు ఫ్యామిలీకి, మహేశ్ ఫ్యామిలీకి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా మహేశ్ భేటీలో పాల్గొనే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇక ప్రముఖ నిర్మాతలు దానయ్య, వంశీలతో పాటు దిల్ రాజు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మరి సమావేశంలో వీరందరి ప్రతిపానదలకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించే ఛాన్స్ కనిపిస్తుందని ఇండస్ట్రీ టాక్. ఈ సమావేశంతో అటు ఇండస్ట్రీలో.. ఇటు విమర్శించిన రాజకీయ నేతలకు సరైన సమాధానం రానుందని.. అలాగే ఇండస్ట్రీ మద్దతు లభించేలా సీఎం జగన్ వ్యూహం వేశారని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఓవైపు ప్రభాస్ కూడా సీఎం జగన్ తో భేటీకి సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలలో టాక్ నడుస్తుంది. మరి సీఎం జగన్ తో చర్చల్లోకి ఎన్టీఆర్, మహేశ్ పాల్గొంటారనే విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.