ఆహాలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణలోని కొత్త యాంగిల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. బాలకృష్ణ అనగానే ముక్కు మీద కోపం.. అభిమానుల మీద దాడి చేస్తారు అనే అభిప్రాయమే ఉండేది చాలా మందికి. అయితే బాలయ్య ఎంత బోళా మనిషో.. అభిమానుల మీద ఆయన ఎంత ప్రేమ చూపిస్తారో చాలా మందికి తెలిదు. రీల్ మీద కన్నా కూడా వాస్తవంగా బాలయ్య చాలా జోవియల్‌గా ఉంటారని.. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ.. సరదాగా ఆట పట్టిస్తారని చాలా మంది చెబుతారు. ఇక పెద్దలంటే బాలయ్యకు ఎంతో గౌరవం, మర్యాద. మరీ ముఖ్యంగా పాత తరం నటీనటులను గౌరవించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. బాలకృష్ణ సీనియర్ నటి కాళ్లు మొక్కిన ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మికి ఎన్టీఆర్ అవార్డు ప్రదానం చేశారు. ఆదివారం తెనాలిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందించగా.. సోమవారం.. హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమయంలో హీరో బాలకృష్ణ ఆమెను వ్యక్తిగతంగా సత్కరించారు. అనంతరం ఆమె పాదాలకు నమస్కరించి.. తన సంస్కారాన్ని చాటుకున్నారు బాలయ్య. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా కాగ.. దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నందమూరి అభిమానులు.
అనంతరం బాలకృష్ఱ మాట్లాడుతూ.. ‘‘ఎల్. విజయలక్ష్మిగారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆమె సినిమాల్లో నటించడమే కాక… రాజకీయ, ప్రజా సేవ అంటూ విభిన్న రంగాల్లో సేవ చేశారు. అలాంటి మహానుభావులను సత్కరించుకొనే మహత్కర కార్యక్రమం ఇది. విజయలక్ష్మి గారు తన కెరీర్‌లో సుమారు వందకు పైగా సినిమాల్లో నటిస్తే.. అందులో 60కి పైగా మా నాన్నగారితోనే కలిసి నటించారు. సినిమాలు మాత్రమే కాక.. ఆమె కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, జావలి వంటి ఎన్నో సంస్కృతిక నాట్యాలు ప్రదర్శించారు. సినిమా ప్రయాణం ఆపేశాక కూడా.. మా నాన్నగారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సీఏ పూర్తి చేశారు. ఆ తర్వాతా వర్జీనియా యూనిర్శిటీలో బడ్జెట్ మేనేజర్‌గా ఉన్నారు. మహిళా సాధికారికతకు ఆమె నిలువెత్తు రూపం’’ అంటూ ప్రశంసించారు.
సీనియర్ నటి ఎల్ విజయలక్ష్మి.. సిపాయి కూతురు సినిమా ద్వారా బాలనటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. 10 ఏళ్ల కాలంలో ఆమె సుమారు 100 చిత్రాల్లో నటించారు. వీటిలో ‘జగదేకవీరుని కథ’, ‘ఆరాధన’, ‘గుండమ్మ కథ’, ‘నర్తనశాల’, ‘పూజా ఫలం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘రాముడు – భీముడు’, ‘భక్త ప్రహ్లాద’ వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. ఆమె ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించారు.