ఇటీవల కరోనా ఉధృతి కారణంగా దేశవ్యాప్తంగా సినీరంగం మరోసారి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదిరిపోయే కలెక్షన్స్ వసూల్ చేసే సంక్రాంతి సమయాన్ని చిన్న సినిమాలు సొమ్ము చేసుకున్నాయి. పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు మూతపడగా.. మరికొన్ని రాష్ట్రాలలో 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయి.
ఇక సంక్రాంతికి రిలీజైన సినిమాలు మంచి వసూళ్లను రాబట్టి పెద్ద సినిమాలను చర్చల్లోకి తీసుకొచ్చాయి. గత రెండు రోజులుగా పాన్ ఇండియా మూవీస్ RRR, రాధేశ్యామ్ సినిమాల రిలీజ్ డేట్స్ గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ 2022 వాలంటైన్స్ డే టైంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రాధేశ్యామ్ మేకర్స్ కూడా కోవిడ్ ని దృష్టిలో పెట్టుకొని(ఢిల్లీలో థియేటర్లు మూతబడినప్పటికి) ఫిబ్రవరి 11న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఎగ్జిబిటర్లతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవేళ వాలంటైన్స్ డే టైంలో కుదరకపోతే మార్చి నెలలో రాధేశ్యామ్ రిలీజ్ ఖాయం అంటున్నారు.ఇక పాన్ ఇండియా మల్టీస్టారర్ RRR విడుదల కోసం రెండు తేదీలను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఒకటి మార్చి సెకండాఫ్ లో, రెండోది ఈద్ ఫెస్టివల్. ఈ రెండు తేదీలలో ఏదోకటి 15 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. మార్చిలోనే RRR వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. పాన్ ఇండియా మూవీ KGF 2 ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. కాబట్టి ఆ టైంలో RRR వచ్చే అవకాశం లేదు.
ప్రస్తుతానికి విడుదల తేదీలను తాత్కాలికంగా నిర్ణయించే చర్చలు ప్రారంభమైనా.. ముంబై, ఢిల్లీ లాంటి ప్రధాన మార్కెట్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఆంక్షలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని నగరాల్లో సినిమా హాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపేందుకు అనుమతులు లభించినా ఈ నెల చివరికి నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. మరి RRR, రాధేశ్యామ్ విడుదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.