మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. రెండు తెలుగు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించాయి. పోటీలో ఉన్న ప్రకాశ్‌రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మొత్తానికి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్ ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రాంతీయత నేపథ్యంలో ఎన్నికలు జరిగాయని అందుకు తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందే ఎన్నికల ఫలితం వెలువడగానే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మెగాబ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఇంత సంకుచిత మనస్తత్తం ఉన్న అసోసియేషన్‌లో తాను కొనసాగదల్చుకోవడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా మా సభ్యత్వానికి ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా, ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి ఎగ్జీక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన శ్రీకాంత్ కూడా పదవికీ, మా సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన మెంబర్లు 8 మంది కూడా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది.
వీరంతా బయటికొచ్చి ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(ఆత్మ)ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త సంఘానికి సినీ పరిశ్రమలోని ఒక పెద్ద ఫ్యామిలీ అండగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇదే జరిగితే ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇలా ఎన్నికల్లో ఓడిన సభ్యులు బయటికొచ్చి వేరే సంఘం ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.