కొన్నిసార్లు వేరే భాషలో నుండి రీమేక్ చేసిన సినిమాలు కూడా ఒరిజినల్ కంటే బాగున్నాయని అనిపించుకుంటాయి. ఒరిజినల్ మూవీని మక్కీకి మక్కీ దింపేయకుండా ఆయా హీరోల ఫ్యాన్స్ కి ఏమేం కావాలో యాడ్ చేసుకొని.. కథ, స్క్రీన్ ప్లే డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. కానీ.. ఆల్రెడీ ఓ భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని రీమేక్ చేయడమే సాహసం. అందులో ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయినా పరవాలేదు. కానీ.. పవర్ ఫుల్ సీన్స్ ని చెడగొడితే మాత్రం ట్రోల్స్ తప్పవు. ఒరిజినల్ కి ఉండాల్సిన క్రేజ్ అలాగే ఉండి, రీమేక్ చేసిన సినిమాని కామెడీ స్పూఫ్ అనిపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ రీమేక్స్ విషయంలో తమిళ స్టార్ దళపతి విజయ్ ఎన్నాళ్ళుగానో ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాడు. తన కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న విజయ్.. రీమేక్స్ చేశాడు గానీ, ఒరిజినల్స్ ని మాత్రం బీట్ చేయలేకపోయాడు. ఫ్యాన్స్ వరకు, కోలీవుడ్ వరకు విజయ్ రీమేక్ సినిమాలను యాక్సెప్ట్ చేస్తారేమో.. ఒరిజినల్ మూవీ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోరు. రీమేక్ చేయడమంటే.. ఒరిజినల్ మూవీ నుండి స్టోరీ లైన్ ఒక్కటి తీసుకొని.. మిగతా సినిమా అంతా నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకోవాలి. కానీ.. విజయ్ తో రీమేక్ సినిమాలు చేసిన దర్శకులంతా ఒరిజినల్స్ ని మక్కీకి మక్కీ అనేలా తీసి.. ప్రశంసలకంటే ఎక్కువగా విమర్శలు ఫేస్ చేశారు.
తెలుగులో డార్లింగ్ ప్రభాస్ నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘ఛత్రపతి’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. వర్షం సినిమా వరకు క్లాస్ లవర్ బాయ్ అనిపించుకున్న ప్రభాస్ ని.. ఛత్రపతి సినిమా ఒక్కసారిగా మాస్ హీరోని చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి – మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణిల ప్యూర్ మ్యాజిక్ ఇది అని చెప్పవచ్చు. 2005లో విడుదలైన ఛత్రపతి బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది. ఈ సినిమాలో ఫ్యామిలీ, యూత్, మాస్, క్లాస్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని సమపాళ్లలో సెట్ చేసి.. డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్ ని తెరపై ప్రెజెంట్ చేసిన విధానం ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తూనే ఉంటుంది.
ఈ బ్లాక్ బస్టర్ సినిమాని తమిళంలో రీమేక్ చేశాడు దళపతి విజయ్. 2008లో ‘కురువి’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో స్టోరీ లైన్ మార్చారు.. కానీ, హీరో క్యారెక్టరైజేషన్, సన్నివేశాలు అన్నీ ఛత్రపతి నుండి కాపీ కొట్టేశారు. విజయ్ తో ఒక్కడు సినిమా రీమేక్ చేసిన డైరెక్టర్ ధరణియే.. ఈ ఛత్రపతి సినిమాని కూడా రీమేక్ చేశాడు. కాగా.. ఛత్రపతిలో తల్లి సెంటిమెంట్ పెడితే.. కురువిలో తండ్రి సెంటిమెంట్ ని పెట్టారు. పైగా ఈ కురువి సినిమాని ‘దోపిడి’ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేయడం గమనార్హం. ఛత్రపతి సినిమా చూసి గూస్ బంప్స్ పొందిన తెలుగు ఆడియెన్స్ దృష్టిలో.. ఈ దోపిడి మూవీ కామెడీ స్పూఫ్ లాగా మారిపోయింది.
మరి ఛత్రపతి సినిమా చూసిన నెటిజన్స్ విజయ్ ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అనంటే.. మీరు సినిమా అంతా చూసే అవసరం లేదు. కేవలం కొన్ని యాక్షన్ సీన్స్, ఫైట్ సీక్వెన్సులు చూస్తే విషయం ఏంటనేది ఇట్టే అర్థమవుతుంది. శాంపిల్ గా ప్రభాస్ – కాట్రాజ్ ల ఫైట్ తీసుకుందాం. ఆ సీన్ లో సూరీడుని కాట్రాజ్ చంపినప్పుడు.. ఒక్కసారిగా ఆవేశంతో రక్తం మరిగిపోతున్న ప్రభాస్ ని మనం చూశాం.. అలాగే చాలు అనే ఒక్క డైలాగ్ తో గూస్ బంప్స్ తెప్పించి ఫైట్ లోకి దిగుతాడు. కాట్రాజ్ ని చెడుగుడు ఆడేస్తాడు. ఈ సీక్వెన్స్ అంతా ఒక సీరియస్ మోడ్ లో.. తెరపై ఒక ఆరడుగుల మాస్ హీరోని చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది.
విజయ్ దోపిడి విషయానికి వస్తే.. ఈ సినిమాలో కాట్రాజ్ పాత్రలో తెలుగు యాక్టర్ జీవా నటించాడు. అయితే.. జీవా లుక్ చూస్తే క్రూరంగానే ఉంటుంది.. కానీ.. అంతటి క్రూరమైన విలన్ ని హీరో విజయ్ కొట్టిన విధానం ఒరిజినల్ ఆడియెన్స్ కి నవ్వు తెప్పిస్తుంది. ఎందుకంటే.. విజయ్ ఎక్సప్రెషన్స్ తో పాటు సీరియస్ డైలాగ్స్ కూడా అందులో కామెడీ చేసేశారు. వెరసి.. సీరియస్ కాకపోగా.. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ అన్నీ కామెడీ స్పూఫ్ వైరల్ అయ్యాయి. ఈ ఒక్క సీనే కాదు.. సినిమాలో ప్రభాస్ లుక్, కటౌట్ ఎలా ఉంటాయి.. విజయ్ లుక్ ఎలా ఉంటుందో గమనించండి. ఇక్కడ హీరోని కామెడీ చేయాలని కాదు.
ఒక సినిమాని రీమేక్ చేయడమో లేక సన్నివేశాలను వాడుకోవడమో చేసినట్లయితే.. ఒరిజినల్ లో వర్కౌట్ అయ్యాయి కదా.. అని మక్కీకి మక్కీ దింపేయకూడదు. విజయ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా, స్క్రిప్ట్ లో మార్పులు, యాక్షన్ సీన్స్ చేసుకుంటే బాగుంటుందని నెటిజన్స్ అంటున్నారు. అంతకుముందే విజయ్ తో చాలా తెలుగు సినిమాలు రీమేక్ చేసి విమర్శలు అందుకున్నారు మేకర్స్. అయితే.. కురువి సినిమా రిజల్ట్ పరంగా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ, ఒరిజినల్ ఛత్రపతి మూవీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారని టాక్ ఉంది. ఇక చివరిగా విజయ్ ని పెట్టి సీరియస్ సీన్స్ ని కూడా కామెడీ చేసి.. విజయ్ పై ట్రోల్స్ వచ్చేలా చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి విజయ్ ప్రస్తుతం వారిసు సినిమాతో రెడీ అవుతున్నాడు.