సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాల పేరుతో కమిట్మెంట్ అడుగుతారని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, నటీమణులు, సీనియర్ నటీమణులు కామెంట్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో చిన్మయి నుంచి బాలీవుడ్ లో రాధికా ఆప్టే వరకూ చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నామని అన్నారు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో దీనికి వ్యతిరేకంగా మీటూ ఉద్యమాన్ని కూడా నడిపారు. ఈ ఉద్యమంలో చాలా మంది హీరోయిన్లు చేరి బయటకు వచ్చారు. కొంతమంది కమిట్మెంట్ అడిగిన వారి పేర్లు కూడా బయటపెట్టారు. తాజాగా నయనతార కూడా క్యాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేసినట్లు వెల్లడించింది. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
భారతీయ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉంది అని నేను చెప్పను గానీ.. తాను మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నట్లు నయనతార వెల్లడించింది. ఒక తమిళ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం తనను ఒక దర్శకుడు కమిట్మెంట్ అడిగాడంటూ కామెంట్స్ చేసింది. ‘సినిమాలో ముఖ్యమైన పాత్ర, మంచి భవిష్యత్తు ఉంటుంది’ అంటూ కమిట్మెంట్ అడిగాడని.. అయితే తాను ధైర్యవంతురాలిని కాబట్టి డైరెక్ట్ గా ముఖం మీదే ఏ అవకాశమూ వద్దని చెప్పేసిందట. తను కేవలం తన యాక్టింగ్ స్కిల్స్, టాలెంట్ ని మాత్రమే నమ్ముకున్నానని ఆమె వెల్లడించింది. అదీ నిజమేలే.. టాలెంట్ ఉండబట్టే కదా ఇన్ని సంవత్సరాలు దక్షిణాది సినిమాని ఏలగలుగుతుంది.
ఇక క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అని చెప్పుకు తిరిగే వారికి కూడా నయనతార చెంప చెల్లుమనేలా జవాబిచ్చింది. సినిమా అవకాశాల కోసం కమిట్మెంట్ ఇస్తే.. మీకు టాలెంట్ లేదని ఒప్పుకుంటున్నట్లు అని ఆమె వ్యాఖ్యానించింది. కమిట్మెంట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుందని.. ఇస్తే ఒకలా, ఇవ్వకపోతే ఒకలా ఫలితం ఉంటుందని.. అయితే మనం ఏ దారిని ఎంచుకున్నామన్నదే ముఖ్యమని ఆమె తెలిపింది. కమిట్మెంట్ ఇచ్చి మోసపోయి పోరాడేకంటే.. కమిట్మెంట్ ఇవ్వకుండా అవకాశాల కోసం పోరాడడంలోనే నిజాయితీ ఉందంటూ నయనతార చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం నయనతార తన కవల పిల్లలతో తన విలువైన సమయాన్ని కేటాయించి వారితో గడుపుతోంది. దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార.. బాలీవుడ్ కూడా పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ అనే సినిమాలో నటించబోతుంది. సెకండ్ షెడ్యూల్ లో నయనతార జాయిన్ అవుతున్నట్లు వెల్లడించింది. గ్లామర్ ఓరియెంటెడ్ పాత్రలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా తన సత్తా చాటుతోంది. కంటెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని ఆమె నిరూపించింది. మరి క్యాస్టింగ్ కౌచ్ పై నయనతార చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.