నయనానందకరమైన నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల పెళ్ళి ఇటీవలే జరిగింది. అయితే వీరి పెళ్ళి ఎలా జరిగింది అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు. కారణం పెళ్ళిని కూడా క్యాష్ చేసుకోవాలనుకోవడమే. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అని ఓ మహానుభావుడు అన్నట్టు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు కూడా సినిమాలే. మరి అలాంటి సినిమాని ఫ్రీగా చూపించేస్తారేంటి? అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో బేరం కుదుర్చేసుకుంది ఈ జంట. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పిక్చర్స్ ని రిలీజ్ చేసింది. త్వరలోనే పెళ్ళి వేడుకను రిలీజ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నయనతార-విఘ్నేశ్ శివన్ల పెళ్ళి వేడుకకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వీరి పెళ్ళికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రయాణానికి సంబంధించి మ్యాజికల్ డాక్యుమెంటరీకి సంబంధించి టీజర్ ను సోషల్ మీడియా వేదికగా వదిలింది. “నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్” పేరిట ఈ టీజర్ ను రిలీజ్ చేసింది. ఇందులో నయనతార, విఘ్నేశ్ శివన్ లు ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందనే విషయాలను చెప్పుకొచ్చారు.
నయనతార మాట్లాడుతూ.. తన మీద విఘ్నేశ్ శివన్ కి ఉన్న ప్రేమని ఖచ్చితంగా తెలుసుకున్నానని అన్నారు. ఇక విఘ్నేశ్ శివన్ మాట్లాడుతూ.. నయనతార స్వభావంతో తాను ప్రేమలో ఉన్నానని, ఆమె కేరెక్టర్ ఆదర్శంగా ఉంటుందని.. అందం బయట మాత్రమే కాకుండా లోపల కూడా ఉంటుందని అన్నారు. ఇక తమ పెళ్లి వేడుక త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని, ఆ మ్యాజిక్ ని చూసేందుకు ఇక ఆగడం తమ వల్ల కాదని అన్నారు. మరి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న వీరి పెళ్లి వేడుకపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.