ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబానికి, ఆయన భార్య ఆలియాకు మధ్య గత కొంత కాలంగా గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలు రోజురోజుకు ముదురుతున్నాయి. చివరకు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి ఆలియా మీద పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు గొడవ వెళ్లింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆలియా 2010లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పెళ్లయిన కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గొడవలు పెరిగిపోవటంతో 2020లో ఇద్దరూ విడాకులకు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలియా.. నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసింది.
తనపై నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం గృహ హింసకు పాల్పడిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, అప్పటినుంచి ఆలియాకు, నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. గత కొంతకాలంగా ఆలియా దుబాయ్‌లో ఉంటోంది. కొద్ది రోజుల క్రితమే ఆమె ఇండియాకు వచ్చింది. కొన్ని రోజులు స్నేహితుల దగ్గర ఉన్న ఆమె తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంటికి వెళ్లింది. విడాకులు ఇంకా మంజూరు కాలేదు కాబట్టి.. తాను ఇప్పటికీ నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్యనేనని ఆమె అంటోంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంట్లో ఉండటానికి ప్రయత్నించింది. ఇందుకు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి, సోదరి ఒప్పుకోలేదు. ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆలియా మాట్లాడుతూ.. ‘‘ వారు అర్థరాత్రి నన్ను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులను పిలిపించారు. నా భర్త షూటింగ్‌లో ఉన్నాడు. అతడి ఫోన్ కలవటం లేదు. నా ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ ఇంటికి వెళ్లాను. వాళ్లు రాత్రి పడుకోవటానికి దుప్పటి కూడా ఇవ్వలేదు. నేను దుబాయ్ నుంచి వచ్చినప్పటినుంచి నా ఫ్రెండ్స్‌తో ఉంటున్నాను. నాకు ఆపరేషన్ చేస్తే వాళ్లు చూడటానికి కూడా రాలేదు’’ అని అన్నారు. పోలీసులు సోమవారం ఉదయం ఆలియాకు నోటీసులు పంపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.