నటుడు నరేష్ గురించి ప్రస్తావన రాగానే పవిత్రా లోకేష్ పేరు కూడా ఆటోమేటిక్ గా బయటకొస్తుంది. గత కొంతకాలం నుంచి కలిసే ఉంటున్న వీరిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది. ఈ విషయమై నరేష్-పవిత్ర స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఈ ట్రోలింగ్ ని ఆపాలని.. వీరిద్దరూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఫొటోల్ని మార్ఫింగ్ చేస్తూ, అసభ్య పదజాలంతో వేధిస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగి, పలు యూట్యూబ్ ఛానెల్స్ కు నోటీసులు జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నటుడు నరేష్ మరోసారి నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. తమపై ట్రోలింగ్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, పలువురు వ్యక్తులపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారించిన కోర్టు.. పవిత్రా లోకేష్, నరేష్ పై ట్రోలింగ్ కు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానెల్స్, వ్యక్తులపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల నుంచి నరేష్-పవిత్రా రిలేషన్ పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే తమని పలువురు ట్రోల్స్ చేస్తున్నారని.. వీరిద్దరూ కోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ ట్రోల్స్ వెనక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉందనే ఆరోపణలు కూడా పవిత్రా చేశారు.
‘నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను అడ్డుపెట్టుకుని నన్ను కించపరుస్తున్నారు. పలు యూట్యూబ్ ఛానెల్స్ వెనక రమ్య హస్తం ఉంది. ఆమె పలు యూట్యూబ్ ఛానెల్స్ ని వెనకుండి నడిపిస్తున్నారు. గతంలో కూడా రమ్య నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. రమ్య,నరేశ్ మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయి. రమ్య ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుంది. నరేశ్, నాపై పలు అభ్యంతర వీడియోలు తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. వీడియెలు, వెబ్ సైట్ వెనక రమ్య పాత్ర ఉందని అనుమానం’ వ్యక్తం చేస్తున్నానని పవిత్రా కొన్నాళ్లు ముందు చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.