ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వారంతా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఒకప్పుడు అవమానం ఎదుర్కున్నావారే.. వాటన్నిటినీ మరచిపోయే స్థాయిలో అభిమానం పొందుతున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎవరికైనా అవమానాలు తప్పవు. ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీలంతా ఒకప్పుడు అవమానించబడ్డవాళ్ళే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి, రవితేజ లాంటి నటులు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవమానాలు, విమర్శలు తప్పవని నేచురల్ స్టార్ నాని అంటున్నారు.
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నాని వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో తాను పడ్డ అవమానాల గురించి చెప్పుకొచ్చారు. ఓ దర్శకుడైతే అందరి ముందు తనను అవమానించాడని అన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చారు కదా.. మొదట్లో ఏమైనా కష్టంగా అనిపించిందా? అని జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దీనికి నాని సమాధానమిస్తూ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కష్టంగా అనిపించిందని అన్నారు.
ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? మొదట్లో అర్థమయ్యేది కాదని, సాయం చేయడానికి కూడా ఎవరూ లేరని అన్నారు. అయితే నేర్చుకుంటున్న సమయంలోనే ఇబ్బంది ఉంటుంది కానీ.. దాని తర్వాత వచ్చే సక్సెస్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. తాను ఎన్నో సవాళ్లు, చాలా మంది తనను తిరస్కరించారని, ఆ విషయాలు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదని అన్నారు. సినీ పరిశ్రమలో ఎంతోమంది పడ్డ కష్టంతో పోలిస్తే తాను పడ్డ కష్టాలు తక్కువని, తనకంటే ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళు తనకు తెలుసునని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే.. అందులోనూ క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఎన్నో అవమానాలు పడాల్సి ఉంటుందని అన్నారు.
ఎవరైనా సరే ఏదైనా చెప్పేయవచ్చునని అనుకుంటారని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని.. అయితే వారికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా అన్నిటినీ దిగమింగక తప్పదని అన్నారు. క్లాప్ బోర్డు ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారని.. అయితే మాటలు పడినందుకు తానెప్పుడూ బాధపడలేదని అన్నారు. కానీ ఒక దర్శకుడు మాత్రం సెట్ లో అందరి ముందు తనను అవమానించాడని, ఎప్పటికీ దర్శకుడివి కాలేవురా అని అన్నాడని గుర్తు చేసుకున్నారు. ఆ మాట తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, ఇలాంటి ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని అన్నారు. స్టార్ హీరో అయ్యాక ఆ దర్శకుడ్ని కలిశానని.. కానీ అతని ఈగో మాత్రం తగ్గలేదని.. అప్పుడు కూడా ప్రతికూల వాతావరణమే ఉందని అన్నారు. ఇక నాని నటించిన దసరా సినిమా మార్చి 30న విడుదల కాబోతుంది. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుందాం.