23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు తారకరత్న. అందరినీ శోక సంద్రంలో ముంచేసి తిరిగి రానీ లోకాలకు వెళ్లిపోయారు. అందరికీ తారకరత్నగా తెలిసిన ఆయనకు ఓ ముద్దు పేరు ఉందని తెలుసా..?
నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రాణాలతో తిరిగి వస్తాడనుకుని భావించిన అభిమానులకు గుండె పగిలే వార్త అందింది. నందమూరి తారక రత్న ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. గత నెల 27న కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏం జరిగిందా అని నిర్దారించుకునే లోపు ఆయన ఆరోగ్య పరిస్థితి చేయి దాటి పోయింది. తొలుత ప్రాథమిక చికిత్స నిమిత్తం కుప్పంలోని సమీప ఆసుప్రతికి తరలించినప్పటికీ, గుండెపోటుగా నిర్దారణ కావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుప్రతికి తరలించి చికిత్స అందించారు.
23 రోజుల పాటు పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అందరినీ కన్నీటి పర్యంతం చేస్తూ ఆయన తిరిగి రానీ లోకాలకు తరలివెళ్లిపోయారు. గుండె పోటుతో బ్రెయిన్ డెడ్ కావడంతో విదేశాల నుండి వైద్యులను రప్పించినప్పటికీ శ్రమ వృథాగా మారిపోయింది. చివరికీ మార్చి 18న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ వార్త నందమూరి కుటుంబానికే కాదూ, అశేష అభిమానులకు సైతం మింగుడు పడటం లేదు. చాలా త్వరగా వెళ్లిపోయవంటూ తారకరత్న అంటూ ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 22న పుట్టిన ఆయన.. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరో ఏ హీరోకు దక్కని అరుదైన రికార్డు ఆయన సొంతం. ఒకే సారి 9 సినిమాలు స్టార్ట్ చేసిన రికార్డు సృష్టించారు.
తెలుగు దేశం వ్యవస్థాపకులు, సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుల్లో ఒకరైన మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. తారకరత్నతల్లి పేరు శాంతి. ఆమె ప్రముఖ నిర్మాత విశ్వేశ్వరావు కుమార్తె. ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. మనందరికీ తారకరత్నగా పరిచయమైన ఆయనకు ముద్దు పేరు ఉందని తెలుసా. తెరపైన తారకరత్న అయినప్పటికీ ఆయనను ఇంట్లో ముద్దుగా ఓబు అని పిలుస్తారట. బెంగళూరు నుండి ఆయన మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి. తారకరత్న మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయాలనుకుంటే.. కామెంట్లరూపంలో తెలియజేయండి.