నందమూరి తారకరత్న మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది. చిన్న వయసులో ఆయన మరణించటం అందర్నీ కలిచి వేస్తోంది. శనివారం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో ఆయన మరణించగా.. రాత్రి భౌతిక దేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు.
ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. శనివారం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న రాత్రే ఆయన మృతదేహాన్ని బెంగళూరునుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఉదయం తారకరత్న భౌతికదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. మోకిలలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. అక్కడ ఉదయం 7 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు సాయంత్రం తారకరత్న అంతిమ క్రియలు జరిగే అవకాశం ఉంది.
కాగా, తారకరత్న జనవరి 26న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు మద్దతుగా సామాన్య జనం, పార్టీ కార్యకర్తలతో కలసి నడుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి కుప్పకూలారు. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకువచ్చారు. దాదాపు 23 రోజులుగా నారాయణ హృదయాలలోనే తారకరత్న చికిత్స తీసుకున్నారు.
సడెన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా తారకరత్న శరీరంలోని పలు అవయవాలు పని చేయటం మానేశాయి. మెదడు కూడా బాగా దెబ్బతింది. దీంతో ఎక్మోద్వారా చికిత్స అందించటం మొదలుపెట్టారు. అప్పటికి కూడా పరిస్థితి విషమంగా ఉండటంతో విదేశీ వైద్యుల బృందాన్ని రంగంలోకి దింపారు. విదేశీ వైద్యుల ప్రత్యేక బృందం తారకరత్నకు చికిత్స అందిస్తూ వచ్చింది. వారి చికిత్సకు కూడా ఆయన శరీరం కోలుకోలేదు. రోజు రోజుకు పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. శనివారం తారకరత్న చికిత్స తీసుకుంటూనే కన్నుమూశారు. మరి, తారకరత్న హఠాన్మరణంపై మీ సంతాపాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.