గత రెండ్రోజులుగా రెండు తెలగు రాష్ట్రాలు, నందమూరి అభిమానులు తారకరత్న ఆరోగ్యం గురించే ఆందోళనలో ఉన్నాయి. అయితే నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదంటూ అభిమానులకు బాలయ్య భరోసానిచ్చారు. ఇప్పుడు తారకరత్న ఆరోగ్యం విషయంలో నందమూరి రామకృష్ణ స్పందించారు. శరీర అవయవాలు అన్నీ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.
“తారకరత్న ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నాడు. మునుపటి కంటే ఆరోగ్యం చాలా మెరుగుపడింది. శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయి. గుండె, లివర్ వంటి ఆర్గాన్స్ అన్నీ సాధారణస్థితికి వచ్చాయి. మంచి వైద్యుల బృందం తారకరత్నకు వైద్యం అందిస్తోంది. న్యూరోకి సంబంధించి సీటీ స్కాన్ చేశారు. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత మంరింత సమాచారం అందుతుంది. వైద్యుల కృషి సత్ఫలితాలను ఇస్తోంది. త్వరలోనే తారకరత్న కోలుకుని మనందరి ముందుకు వస్తాడు. తారకరత్న ఆరోగ్య బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. తారకరత్న ఆరోగ్యం విషయంలో ఎలాంటి ప్రచారాలను నమ్మకండని, తప్పుడు ప్రచారాలు ఆపాలంటూ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. జనవరి 27న లోకేష్ యువగళం పాదయాత్రలో నందమూరి తారకతర్న పాల్గొన్నాడు. కొద్దిసేపటి తర్వాత తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ తారకరత్నకు యాంజియోప్లాస్టీ చేశారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు మార్చారు. గుండెపోటు సమయంలో రక్తప్రసరణ అందక ఆయన మెదడు పనితీరు దెబ్బతిందని వైద్యులు చెప్పారు. నారాయణ హృదయాలయ- నిమ్హాన్స్ వైద్యుల బృందం ప్రస్తుతం తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీట్మెంట్ బాగా స్పందిస్తున్నారని చెబుతున్నారు. తారకరత్న ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ నందమూరి ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.