సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు. కానీ.., వారిలో రియల్ హీరోలు అనిపించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే సోనూసూద్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు ప్రజా సేవలో ముందుంటున్నారు. వీరిలో బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మందికి వైద్యం అందిస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఫ్యాన్స్ తో బాలయ్యకి ఉండే బంధం చాలా చిత్రమైనది. క్రమశిక్షణ తప్పితే బాలకృష్ణ వాళ్ళని దండిస్తాడు. వాళ్లేమో బాలయ్య చేతి స్పర్శ మాకు ఆనందం అంటూ స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ.., తప్పు చేస్తే కొట్టే బాలయ్య.., అభిమానికి కష్టం వస్తే చలించిపోతాడు. ఇక వాళ్ళు ఆ కష్టం నుండి కోలుకునే వరకు అండగా నిలబడిపోతాడు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలుకుని బాలకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్ కి ఫోన్ చేసి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గొల్లపల్లికి చెందిన 23 ఏళ్ల మురుగేష్ నందమూరి వంశానికి వీరాభిమాని. టెంకాయ చెట్ల మీద నుండి కాయలు దింపడం ఇతని జీవనోపాధి. నెల రోజుల కిందట మురుగేష్ చెట్టు మీద నుండి జారి పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. దీంతో మురుగేష్ ను ఇంట్లో పెట్టుకునే చూసుకుంటున్నారు అతని కుటుంబ సభ్యులు. అభిమాన సంఘాల ద్వారా ఈ విషయం బాలయ్యకి ఆలశ్యంగా తెలిసింది.వెంటనే అభిమానికి సహాయం అందించాడు. నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు శివ రాయల్.. అభిమాని మురుగేష్ ఇంటికి వెళ్లి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. మళ్ళీ రెండో సారి బాలయ్య పుట్టినరోజు నాడు మరో 25,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వీల్ ఛైర్ కూడా అందచేశారు.
ఇంత చేసినా బాలయ్య తృప్తి పడలేదు. తాజాగా తన అభిమానికి ఆయనే ఫోన్ చేశాడు. మురుగేష్ బాగోగులు, ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను మంచానికే పరిమితమవడంతో తల్లి కూలి పనులకు వెళ్లాల్సి వస్తుందంటూ అభిమాని బాలయ్యతో తన బాధ పంచుకున్నారు. వెంటనే స్పందించిన బాలకృష్ణ… “నువ్వు ఇక వాటి గురించి ఆలోచించకు. నేను ఉన్నాను. ప్రశాంతంగా ఉండు. నీ కుటుంబం హాయిగా బతికే ఏర్పాట్లు చేస్తా” అంటూ భరోసా ఇచ్చాడు. తన అభిమాన హీరో ఇలా తనకే ఫోన్ చేసి మాట్లాడటంతో మురుగేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో.., నలుగురిని కొట్టాలన్నా, పది మందికి పెట్టాలన్న బాలయ్యకే సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.