పవన్ కల్యాణ్ ఒక అగ్ర హీరోగానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో బిజీగా ఉంటున్నారు. హీరోగా ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ సిల్వర్ స్క్రీన్ చరిష్మా కంటే ఆయన వ్యక్తిత్వానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. పదేళ్లపాటు ఒక్క హిట్టూ లేకపోయినా ఫ్లాపులతో రికార్డులు కొట్టడం, రెండుచోట్ల పోటీ చేసి ఓడినా విమర్శలను ఎదుర్కొని నిలబడి పోరాడటం అందరినీ ఆకర్షించే విషయాలు. అంతేకాకుండా పవన్ అనగానే దానాలు, సాయాలే గుర్తొస్తాయి. ఇలా డబ్బు దానం చేసుకుంటూ పోతారు.. అసలు ఆయనకు ఆస్తులు ఎన్నున్నాయి? అనే ప్రశ్న చాలామందికి రావచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం స్వయంగా ఆయన అన్నయ్య నాగబాబు చెప్పారు.
మెగా బ్రదర్ నాగబాబు సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఆస్తుల గురించి స్పందించారు. “కల్యాణ్ బాబుకి ఆస్తుల కన్నా కూడా అప్పులే ఎక్కువ ఉన్నాయి. హైఎస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అయిన పవన్ కల్యాణ్ కు అప్పులు ఉన్నాయంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. పార్టీ కోసం, ప్రజల కోసం తన సంపాదన నుంచి సాయం చేస్తుంటాడు. జనసేన ఆవిర్భావ సమయంలో పిల్లల పేరిట ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లు తీసేశారనే వార్తలు కూడా నిజమే. తన ఆస్తులు మొత్తం మార్టిగేజ్ లోనే ఉన్నాయి. తనకంటూ ఉన్న ఆస్తులు ఏమీ లేవు. ఒక్క ఫామ్ హౌస్ మాత్రమే ఉంది” అంటూ నాగబాబు చెప్పారు.
“పవన్ కల్యాణ్ కు ఉన్న ఒకే ఒక్క ఆస్తి శంకరపల్లిలోని 8 ఎకరాల పొలం మాత్రమే. పవన్ కు ఫార్మింగ్ అంటే ఇష్టం అందుకే కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే సమయంలో కేవలం రూ.8 లక్షలు పెట్టి 8 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తాను తీసుకున్న రూ.కోటిన్నర రెమ్యూనరేషన్ ని డిస్టిబ్యూటర్స్ కి వెనక్కి ఇచ్చేశాడు. ఇంకా తన సేవింగ్స్ కూడా కొన్ని వాళ్లకే ఇచ్చాడు. ఆ 8 ఎకరాల పొలం కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు దాని విలువ రూ.15 లక్షల వరకు ఉంది. నేను అడ్డుపడి ఆపాను. రెమ్యూనరేషన్ ఇచ్చేశావు, సేవింగ్స్ ఇచ్చేశావు, ఇష్టపడి కొనుకున్న ఆ పొలం దేనికి అమ్మడం అని వారించాను. తనకున్న ఇల్లు, కార్లు కూడా లోన్ లోనే ఉన్నాయి” అంటూ పవన్ కల్యాణ్ ఆస్తుల విషయంలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు.