2010 లో విడుదలైన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేశారు. కాగ అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆరెంజ్.. రీ రిలీజ్ లో మాత్రం దుమ్మురేపింది. దాంతో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు నాగబాబు.
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు బాగానే ఉన్నా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతాయి. అంచనాలు అందుకోవడంలో కొన్ని సినిమాలు విఫలమైతే.. ప్రేక్షకులు అర్ధం చేసుకోలేక దురదృష్టం కొద్ది ఇంకొన్నిసినిమాలు పరాజయం పాలవుతాయి. అయితే థియేటర్ లో మెప్పించలేని కొన్ని సినిమాలు బుల్లి తెరపై మాత్రం మంచి రేటింగ్ సాధిస్తాయి. టాలీవుడ్ నుంచి ఈ లిస్టులో అతడు, వన్ నేనొక్కడినే, ఆరెంజ్, వేదం, ఖలేజా లాంటి క్లాసిక్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే..వీటిలో ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ లో సక్సెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తాజాగా నాగబాబు తెలియజేశాడు.
2010 లో విడుదలైన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క సినిమా ఫ్లాప్ తో చరణ్ క్రేజ్ అమాంతం పడిపోగా .. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తన తర్వాతి సినిమా చేయడానికి మూడేళ్లు పట్టింది. ఇక నిర్మాత నాగబాబు అయితే ఈ సినిమా భారీ నష్టాలు తీసుకురావడం వలన చాలా కృంగిపోయానని ఒకానొకదశలో సూసైడ్ కూడా చేసుకోవాలనిపించిందని ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు. అయితే ఈ సినిమా భారీ పరాజయాన్ని చూసినా.. ఇప్పటికీ ఈ సినిమాకి చాలామంది అభిమానులు ఉన్నారు. వాస్తవిక జీవితాన్ని తెరపై కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాని అప్పట్లో ప్రేక్షకులు సరిగా ఆదరించకపోయినా.. క్రమంగా ఈ సినిమాకు అభిమానులు పెరుగుతూ వచ్చారు.
ఆ ధైర్యంతోనే ఈ సినిమాని రామ్ చరణ్ పుట్టిన రోజు రీ-రిలీజ్ చేయాలని భావించారంతా. బ్లాక్ బస్టర్ సినిమా మగధీరని కాదని ఆరెంజ్ సినిమాని రీ-రిలీజ్ చేయడం పట్ల అందరు కాస్త అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ.. ఈ సినిమా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ నెల 27 న ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా.. దాదాపు 75 లక్షల గ్రాస్ వసూల్ చేసి అందరిని అవాక్కయేలా చేసింది. దీంతో నిర్మాత నాగబాబు ఈ సినిమా పట్ల సంతోషం వ్యక్తం చేసాడు. రామ్ చరణ్ కి ఒక సక్సెస్ ఇవ్వలేకపోయాననే బాధ నాకు నేటితో పోయిందని చెప్పుకొచ్చాడు.
నాగబాబు సోషల్ మీడియా ద్వారా వీడియోలో మాట్లాడుతూ.. “చిరుత, మగధీర వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ కి ఫ్లాప్ ఇచ్చాననే బాధ ఇన్ని రోజులు ఉండేది. ఈ సినిమాను రీ-రిలీజ్ చేద్దామంటే నేను ఆలోచించాను. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకి గ్లోబల్ అవార్డు, ఆస్కార్ రావడంతో.. ఆ ఉత్సాహంతో ఆరెంజ్ ను రీ-రిలీజ్ చేద్దామని భావించాను. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆరెంజ్ సినిమాకి ఇంతమంది అభిమానులున్నారా అని ఆశ్చర్యమేసింది. 2010లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఎవరికీ నచ్చలేదు. కానీ ఇప్పటి జనరేషన్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆరెంజ్ ను రామ్ చరణ్ హిట్ మూవీస్ లో ఒకటిగా పరిగణించవచ్చు. నా వల్ల చరణ్ కి సక్సెస్ దూరమైందన్న బాధ నేటితో పోయింది. ఇదంతా చరణ్ వల్లే సాధ్యమైంది” అని నాగబాబు చెప్పుకొచ్చారు.