మెగా కాంపౌండ్‌లో ఎందరో హీరోలు ఉన్నారు. చిరంజీవి మొదలు వైష్ణవ్ తేజ్ వరకు చాలా మంది హీరోలు ఉన్నారు. ఇక నాగబాబు నటుడిగానే కాక నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తన కుటుంబంలో ఎందరో హీరోలు ఉన్నా తనకు ఎప్పుడు క్యారెక్టర్ ఆఫర్ చేయలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగబాబు. ఆ వివరాలు..
నటుడు నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాతగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఆయన శ్రీదేవి శోభన్ బాబు చిత్రంలో నటించారు. ఈ నెల 18న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర బృందం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ సినిమాకు మెగా డాటర్ కొణిదెల సుస్మిత, ఆమె భర్త సహా నిర్మాతలుగా వ్యవహరించారు. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. నాగబాబు హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగబాబు మాట్లాడుతూ సుస్మితపై ప్రశంసలు కురిపించారు. తన ఇంట్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి.. సుస్మిత వాళ్ల సాయం తీసుకోకుండా సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోందని ప్రశంసించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో చాలా మంది హీరోలున్నారు. కానీ, వాళ్లు నాకు ఎప్పుడూ ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్ హనీ (సుస్మిత) నాకు అవకాశం ఇచ్చింది. ఇదే మొదటి అవకాశం కాదు.. ఇది రెండోది. ఇంకో వెబ్ సిరీస్‌లో కూడా అవకాశం ఇచ్చింది మా హానీ’’ అంటూ సుస్మితపై ప్రశంసలు కురిపించారు నాగబాబు
అంతేకాక ‘‘సుస్మితకు సపోర్ట్‌గా మా ఇంట్లోనే చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్లలో ఎవరిని అడిగినా సరే.. వెంటనే ఒప్పుకుని, కళ్లు మూసుకుని నటించడానికి ఓకే చేస్తారు. కానీ, సుస్మిత మాత్రం.. ఏ స్టార్ హీరో సపోర్ట్ లేకుండా.. సొంతంగా బయట నిర్మాతలు ఎన్ని కష్టాలు పడతారో అలాంటి వాటిని దాటుకుని.. ఆ అనుభవం సంపాదిస్తూ.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సినిమా కన్నా ముందు.. సుస్మిత కొన్ని వెబ్ సిరీస్‌లు చేసిన సంగతి మీకు తెలుసు. ఇక తాజాగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. కచ్చితంగా చెప్తున్నాను.. త్వరలోనే మా హనీ (సుస్మిత) మెగా ప్రొడ్యూసర్ కాబోతోంది. తనకు నా శుభాకాంక్షలు’’ అన్నారు నాగబాబు.
ఇక సినిమాల్లో మహిళల ప్రస్తావన తీసుకొచ్చిన నాగబాబు.. ‘‘టీవీ రంగంలో ఆడవాళ్ల డామినేషన్ కనిపిస్తుంది కానీ.. సినిమాల్లో మాత్రం మగాళ్ల ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటికి కూడా ఆడ పిల్లలను సినిమా ఇండస్ట్రీలోకి పంపించకూడదు.. ఆడ పిల్లలు సినిమాల్లో నటించడకూడదు.. వారు చిత్రాలు నిర్మించకూడదు.. అనే ఆలోచన మనలో చాలా మందికి అలానే ఉంది. ఇంకా మార్పు రాలేదు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలా ఆలోచించే వారు ఎందరో ఉన్నారు. కానీ మహిళలకు అవకాశం ఇస్తే వారు.. మగవారి కంటే బాగా నటించగలరు.. సినిమాలకు అంత గొప్పగా దర్శకత్వం వహించగలరు. చాలామంది ఈ విషయాన్ని రుజువు చేశారు.. ఇక ముందు కూడా చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి. మరి నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.