తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు నాగ చైతన్య. పర్సనల్ లైఫ్ పక్కన పెడితే.. ఆ సినీ కెరీర్ ఇంకా గాడిన పడలేదు. ఇప్పుడు కస్టడీ సినిమాతో రాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న చైతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటుడు నాగ చైతన్య గురించి చెప్పనక్కర్లేదు. తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చైతూ.. తనను తాను నిరూపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జోష్ నుండి కస్టడీ మూవీ వరకు ఆయన ప్రయాణం చూస్తే నిజమనిపించకమానదు. కస్టడీ మూవీతో రాబోతున్న చైతూ.. ఇటీవల ఓ కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని సందడి చేశారు. చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ వ్యక్తిగా ఉండే ఈ అక్కినేని వారసుడు.. అదరగొట్టే స్పీచ్‌తో కట్టి పడేశారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలకు నాగ చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కాలేజ్ అధినేత, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘నాకో చిన్న డౌటు. కాలేజీలో మల్లారెడ్డిని పెట్టుకుని, బయట నుండి సెలబ్రిటీని తీసుకురావడం అవసరమాని’ఫన్నీ కామెంట్ చేశారు. సినిమా డైలాగుల కంటే మీ స్పీచ్‌లే ఫేమస్ అవుతున్నాయని మల్లారెడ్డినుద్దేశించి పేర్కొన్నారు. ‘నిజం చెప్పాలంటే సర్ (మల్లారెడ్డి) చెప్పినట్లు డోంట్ ఎవర్ గిప్ అప్. ఆయన ఎంత కష్టపడి.. ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ఆ జర్నీ వెనకలా ఎంత కష్టముందో ఆయనకే తెలుసు. అవన్నీ ఆయన స్పీచ్‌ల ద్వారా విన్నాం. ఆయన మనందరికీ ఎంతో స్ఫూర్తి. ఆయన చెప్పినట్లే. .ఎప్పటికీ వెనుకడుగు వేయోద్దు’ అని విద్యార్థులనుద్దేశించి అన్నారు.
లైఫ్‌లో రోజు ఏదో ఒక స్పీడు బ్రేకర్ కనిపిస్తూనే ఉంటుందని, దాన్నిపట్టించుకోవద్దని, జస్ట్ పని చేసుకుంటూ వెళ్లిపోండని సూచించారు. ‘చదువు విషయంలోనైనా, పర్సనల్, ప్రొఫెషనల్ విషయంలోనైనా, లైఫ్‌లోనైనా, లవ్‌లోనైనా మీకు ఏదీ కరెక్ట్ అనిపిస్తే అది చేస్తూ.. గోల్ సెట్ చేసుకుని.. ఆ గమ్యం వైపుకు పరుగుతీయండి. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఫ్రైడేకు హీరోల జాతకాలు మారిపోతాయి. ప్లాప్ వస్తే నెక్స్ట్ సినిమా ఎలా హిట్ కొట్టాలనుకుంటాము. అలాగే హిట్ కొడితే..నెక్ట్స్ సినిమా ఇంకా పెద్ద హిట్ కొట్టాలని ఆలోచిస్తాం. ఎక్కడైనా సరే జస్ట్ కీప్ వర్కింగ్. డోంట్ ఎవ్వర్ గిప్’అని చెప్పారు. ఈ సందర్భంగా కస్టడీ సినిమా ట్రైలర్ నచ్చిందా అని స్టూడెంట్స్‌ను అడిగారు. టీజర్ నచ్చిందంటే సినిమా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారన్నారు.
మే 12న సినిమాను థియేటర్లలో వచ్చి చూడాలని కోరారు. కస్టడీ సినిమాలో శివ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందన్నారు. తన సినీ కెరీర్ కూడా కాలేజీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కథతోనే మొదలైందన్నారు. కాలేజ్ డేస్ ద బేస్ట్ డేస్ ఇన్ యువర్ లైఫ్ అని, నాలుగేళ్లలో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయండన్నారు. లెక్చరర్స్ మాట వినండని, కాలేజీ అయిపోయాక, జీవితంలో ముందుకు వెళ్లాక వారి మాటలు గుర్తుకు వస్తాయన్నారు. మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్‌లో 65 వేల మంది యువత చదువుతున్నారని, ఇది అమేజింగ్ ఎచివ్ మెంట్ అని ఆయనను కొనియాడారు. భవిష్యత్తు అనేది యువత చేతిలోనే ఉందని, ఫ్యూచర్ బాగుండాలంటే యువత బాగుండాలని పేర్కొన్నారు.