తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. మొన్నటి ఆదివారం 13వ కంటెస్టెంట్‌గా బయటకు వచ్చిన ప్రియాంక ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటుంది. దాదాపు 91 రోజులు హౌజ్‌లో ఉండి నువ్వంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేశావు అంటూ పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జబర్ధస్త్ కామెడీ షో తో పెద్దగా గుర్తింపు రాకున్నా.. బిగ్‌బాస్ షో కారణంగా ప్రియాంక లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ట్రాన్స్ జెండర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. గత సీజన్‌లోని తమన్నా సింహాద్రి లాగే కొద్ది రోజుల్లోనే ఎలిమినేట్ అయిపోతుందని అంతా భావించారు. కాని అందరి ఊహాలోచనలు తలకిందులు చేసి తానేంటో నిరూపించింది.
ఒకానొక దశలో టాప్ 5లో ప్రియాంక కచ్చితంగా ఉంటుందనేట్లుగా తన గేమ్‌ని కొనసాగించింది. అయితే అనూహ్య పరిణామాల వల్ల గత ఆదివారం ప్రియాంక ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా పింకీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ప్రియాంక తన స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుస్తుంది. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబుని కలిసింది. ఆయన ఆశీర్వాదం అందుకుంది. జబర్ధస్త్ లో నాగబాబు ఉన్న సమయంలో ప్రియాంకను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. నాగబాబు ని కలిసిన పింకిపై ప్రశంసల జల్లు కురిపించారు.
‘ఎన్నో అసమానతలు, అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నావు. నువ్వు బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోవచ్చు.కానీ సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి స్పూర్తిగా నిలిచావు. ఎలా ఉన్నా కూడా జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అని నాగబాబు తన ఇన్ స్ట్రాలో పోస్ట్ పెట్టారు.