రీసెంట్ గా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ నామినేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి.. ఇప్పుడు ఆస్కార్ గెలుచుకోవడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చేసింది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని విధంగా ఓ తెలుగు సినిమా ఈ ఘనత సాధించడంతో చరిత్ర సృష్టించినట్లు అయింది. అయితే ఆస్కార్ రావడానికి సరిగ్గా కొన్నిరోజుల ముందు ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్కార్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. దీంతో కె.రాఘవేంద్రరావు, మెగాబ్రదర్ నాగబాబు లాంటి వాళ్లు రెచ్చిపోయారు. తమ్మారెడ్డికి ఎంతివ్వాలో అంతా ఇచ్చేశారు. ఇప్పుడు తమ్మారెడ్డినే.. ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ రావడంపై స్పందించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏదైనా ఓ విషయం జరిగినప్పుడు అందరిలానే మాట్లాడకుండా కొందరు వితండవాదం చేస్తుంటారు. ఆ తర్వాత వివాదాల్లోనూ ఇరుక్కుంటూ ఉంటారు. తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అలానే జరిగింది. ఆస్కార్ కి వెళ్లేందుకు ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బు తనకిస్తే 8 సినిమాలు తీసి ముఖాన కొడతానని అన్నారు. దీంతో ఆయనపై చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సెలబ్రిటీల దగ్గర నుంచి సినీ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ విమర్శలు చేశారు. ఇప్పుడు ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకోవడంతో తమ్మారెడ్డి రియాక్షన్ కోసం ఎదురుచూశారు. అందుకు తగ్గట్లే ఆయన ఓ వీడియోని రిలీజ్ చేశారు.
‘మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందం, గర్వంగా ఉంది. నాకే కాదు ప్రతి భారతీయుడు, సినిమాని ప్రేమించే వాళ్లకు ఇది గర్వకారణం. తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతి కొద్దిమందిలో కీరవాణి, చంద్రబోస్ ఒకరు. వాళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు నా అభినందనలు తెలియజేస్తున్నాను.’ అని తమ్మారెడ్డి ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తమ్మారెడ్డి రియాక్షన్ వైరల్ గా మారింది. మరి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ముందు, తర్వాత మాట్లాడిన మాటలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.