సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలసిందే. మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని రకాల ఆడియెన్స్ ఆయన సినిమాలను ఇష్టపడుతుంటారనేది తెలిసిందే. ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ తలైవాకు మంచి ఆదరణ ఉంది. రజినీ సినిమా వస్తోందంటే చాలు, చూసేందుకు అందరూ సిద్ధమైపోతారు. తమిళంతో పాటు తెలుగు, హిందీల్లోనూ రజినీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ‘బాషా’, ‘అరుణాచలం’, ‘నరసింహ’, ‘బాబా’, ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘రోబో’ లాంటి చిత్రాల ద్వారా తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో ఆయన చెరగని స్థానాన్ని సంపాదించారు. అందుకే రజినీ నటించే మూవీస్ తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. వీటిని పక్కనపెడితే.. నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ రజినీని చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతుంటారు. కానీ రజినీకాంత్ మాత్రం ఇవాళ తాను ఇలా ఉండేందుకు తన భార్య లతే కారణమని అంటున్నారు. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటున్నారు.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో గెస్ట్‌గా పాల్గొన్న రజినీ వేదికపై మాట్లాడుతూ తన భార్య లత వల్లే క్రమశిక్షణను అలవర్చుకున్నానని తెలిపారు. ‘నా భార్య లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. బస్సు కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో రోజూ మద్యం తాగేవాడ్ని. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్క ఉండేది కాదు. అలాగే రోజూ మాంసాహారం కూడా తీసుకునేవాడ్ని. కానీ, ఈ మూడూ మంచి అలవాట్లు కాదు. వీటిని బానిసైన వాళ్లు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరు. నా భార్య లత తన ప్రేమతో నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను నా జీవితాన్ని క్రమశిక్షణతో గడుపుతున్నా’ అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. ఇక, ప్రస్తుతం ‘జైలర్’ అనే మూవీలో తలైవా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.