సినిమా రంగంలో ఉండే వారి గురించి వాస్తవాల కన్నా తప్పుడు వార్తలే ఎక్కువ ప్రచారంలో ఉంటాయి. ఇప్పుడనే కాదు.. ఇండస్ట్రీ ప్రారంభం నుంచి ఇలాంటి ప్రచారాలు ఉన్నాయి. ఓ అగ్ర హీరో గురించి ఇలానే తప్పుడు ప్రచారం జరిగింది. ఆయనకు పిచ్చి పట్టిందని.. ఆర్థికంగా చితికిపోయాడని. మరి అసలు వాస్తవాలు ఏంటి అంటే..
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. మిగతా రంగాలతో పోలిస్తే.. ఇక్కడ కొనసాగాలంటే.. కృషి, శ్రమ, పట్టుదలతో పాటు.. ఆవగింజంత అదృష్టం కూడా తోడవ్వాలి. లేదంటే.. జీవితాలు తారుమారవుతాయి. కొన్నేళ్ల పాటు సూపర్‌స్టార్‌గా వెలుగొందిన వారు ఉన్నట్లుండి అట్టడుగు స్థాయికి పడిపోతారు. అప్పుడు వారి మీద కనీసం జాలి పడే వారు కూడా ఉండరు. పైపెచ్చు బాగా అయ్యింది అంటారు. కనీసం ఆదుకునేవారు కూడా ఉండరు. కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అందుకుని.. ఆ తర్వాత పాతాళానికి పడి పోయిన వారు ఎందరో ఉన్నారు. కొందరు నిజంగానే ఇలాంటి కష్టాలు అనుభవిస్తే.. మరి కొందరి నటీనటుల గురించి మాత్రం ఇలాంటి పుకార్లు ప్రచారంలోకి వచ్చేవి. అలానే బాపు దర్శకత్వంలో చేసిన ఓ హీరో గురించి ఇలాంటి పుకార్లే ప్రచారంలోకి వచ్చాయి. ఏకంగా ఆ హీరోకు పిచ్చి పట్టిందని.. ఆర్థికంగా చితికి పోయి రోడ్డున పడ్డారంటూ బోలేడు వార్తలు వచ్చాయి. ఇంతకు ఎవరా హీరో.. ఆ వార్తలు నిజమేనా అంటే..
1975 ప్రాంతంలో బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమా గుర్తుందా. ఆ సినిమాలో హీరోగా నటించి.. తన నటనతో మెప్పించి.. అందరిని తనవైపు తిప్పుకున్నాడు హీరో శ్రీధర్. సినిమాలో అతడి నటన చూసిన వారు.. చాలా గొప్పగా ఎదుగుతాడని భావించారు. ఇక శ్రీధర్ నటనపై ప్రశంసలు కురిపించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బాపు సైతం శ్రీధర్‌ను ప్రశంసించారు. ‘‘నా అభిమాన నటుల్లో శ్రీధర్ ఒకరు.. ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా పంచ రంగుల్లో పెంచుకోను సమర్థత కలిగిన నటుడు’’ అంటూ బాపు ప్రశంసలు కురిపించాడు అంటే.. శ్రీధర్ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ముత్యాల ముగ్గు సినిమా భారీ విజయం సాధించింది. ఇక శ్రీధర్ దశ తిరుగుతుందని అంతా భావించారు. కానీ పరిస్థతి మరోలా ఉంది. చాల కాలం పాటు ఆయనకు అవకాశాలే రాలేదు. మళ్లీ బాపు దర్శకత్వంలో వచ్చిన భక్త కన్నప్ప చిత్రంలో నటించాడు శ్రీధర్. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. శ్రీధర్ హీరోగా చేస్తున్న సమయంలోనే.. ఎన్‌టిఆర్ ఆయన చేత శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన సమయంలో టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం వెండి తెరకు దూరమయ్యారు. కానీ ముందుచూపుతో హైదరాబాద్ వచ్చి.. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి బాగా ఆర్జించారు శ్రీధర్.
శ్రీధర్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ, హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో జూలై 11, 2007 న మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే శ్రీధర్‌కు చివరి దశలో మతి స్థిమితం తప్పి పిచ్చి పట్టిందని.. ఆర్థిక కష్టాలు అనుభవించాడని వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదు. ఆయన జీవితంలో బాగానే ఆర్జించాడు.. ఎలాంటి ఆర్థిక కష్టాలు అనుభవించేలేదు అని కుటుంబ సభ్యులు తెలిపారు. నటుడు శ్రీధర్ నటించిన సినిమాల్లో మీకు ఏ మూవీ ఇష్టం.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.