ఈమధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో క్లాసిక్ అనదగ్గది ‘సీతారామం’. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై ఆ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు.
ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే హిట్ అవుతాయి. సూపర్ హిట్ అయ్యే చిత్రాలనైతే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. సినీ పరిశ్రమలో హిట్ల శాతం తక్కువే. అయితే గత మూడ్నాలుగేళ్లలో టాలీవుడ్లో సక్సెస్‌ల శాతం బాగా పెరిగింది. ఇది శుభపరిణామం అనే చెప్పాలి. విజయాల శాతం పెరగడంతో పాటు ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్స్ కూడా ఈమధ్య వచ్చాయి. ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే అలాంటి సినిమాల్లో ఒకటి ‘సీతారామం’. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సంగతి తెలిసిందే.
‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులూ ‘సీతారామం’ను ఆదరించారు. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో దీనిపై మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె నటించిన ఒక బాలీవుడ్ మూవీ రిలీజైన సందర్భంగా మృణాల్ ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఆ సినిమాతో పాటు తాను చేస్తున్న, చేయబోతున్న చిత్ర విశేషాలను కూడా అభిమానులతో ఆమె పంచుకున్నారు. ఆ చిట్‌చాట్‌లో ‘సీతారామం-2’ ఉంటుందా అని మృణాల్‌ను ఓ ఫ్యాన్ అడిగాడు. ఈ క్వశ్చన్‌కు మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ.. ‘సీతారామం’ ఒక అద్భుతమైన సినిమా అని చెప్పారు.
‘సీతారామం మూవీ సీక్వెల్ గురించి ప్రస్తుతానికైతే నా దగ్గర సమాచారం లేదు. కానీ, రెండో పార్ట్ కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని అభిమాని ప్రశ్నకు మృణాల్ బదులిచ్చారు. తెలుగులో ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలని ఒక నెటిజన్ ఆమెను కోరారు. దీనికి.. ‘అదిగో మళ్లీ మొదలు’ అని ‘సీతారామం’ డైలాగ్‌తో మృణాల్ రిప్లై ఇచ్చారు. అంతేకాదు, ఆ మూవీ చిత్రీకరణ సమయంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ టీమ్‌ను మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రాన్ని సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు డైరెక్టర్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మృణాల్ ఠాకూర్ ట్వీట్‌తో మరోసారి ఈ విషయం తెర మీదకు వచ్చింది.