సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అనే సామెత ఉంది. చిన్న వాళ్లకు, పెద్ద వాళ్లకు సమస్యలు ఉంటాయని చెప్పేందుకు ఈ సామెతను వినియోగిస్తుంటారు. సామాన్యుడికే కాదూ సెలబ్రిటీలకు కూడా సమస్యలు వస్తుంటాయి. తనకు ఓ కష్టమొచ్చిందని మొర పెట్టుకుంటోందీ ఓ నటి. సమస్యను తీర్చాలని వేడుకుంటోంది.
రంగుల ప్రపంచంలో కలర్ ఫుల్ లైఫ్ ఉంటుంది అనుకుంటాం కానీ, వారిని కూడా కష్టాలు వెంటాడుతుంటాయి. బయట స్వేచ్చగా తిరగలేరు. ఫిజిక్ మెయిటెన్స్ కోసం ఏమీ తినలేని పరిస్థితి. చిన్న చిన్నఆనందాలను కోల్పోతుంటారు. ఇవి చాలన్నట్లు కొంత మంది పనిగట్టుకుని వీరిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుంటారు. వీరి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వారిని వేధింపులకు గురి చేస్తుంటారు. అమితాబ్ బచ్చన్ నుండి అనేక మంది స్టార్ హీరో, హీరోయిన్లు బెదిరింపులకు గురైనవారే. సోషల్ మీడియా వాడుక ఎక్కువయ్యాక ఈ బెదిరింపులు మరింత పెరిగాయి. వారి ఖాతాలను హ్యాక్ చేయడం వంటి చర్యలకు దిగుతున్నారు. తాజాగా ప్రముఖ నటి తీవ్ర బెదిరింపులకు లోనయ్యారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందించిన సీతారామంతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో ఆమె చేసిన సీతామహాలక్ష్మి పాత్రకు ఫిదా అవ్వని వారుండరు. ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే ఈ నటి ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నారు. మృణాల్ ఈ మెయిల్ ఖాతాను ఆగంతకులు హ్యాక్ చేశారట. అంతేకాకుండా బెదిరింపులు కూడా చేస్తున్నారట. ఈ విషయాన్ని సదరు బ్యూటీనే తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసుకుంది. ‘నా ఈ-మెయిల్ ఖాతా హ్యాక్ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా వ్యక్తిగత సమాచారం, నా సినిమా స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి.’ అంటూ వీడియోలో పేర్కొంది. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ వీడియో రానా నాయుడు ప్రమోషన్ కోసం చేసింది.
ఇలా మీ ఈమెయిల్ హ్యాక్ అయితే దాని నుంచి ఎలా బయట పడాలో తెలియాలంటే రానా నాయుడు చూడండి అంటూ చెప్పుకొచ్చింది మృణాల్. వెంకటేష్, రానా నటించిన రామానాయుడు సెరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ప్రమోషన్లలో భాగంగా జాన్వీకపూర్ తో కూడా వీడియో చేయించింది. బాలీవుడ్ లో సీరియల్స్ నుండి వెండితెర మీదకు అనూహ్యంగా వచ్చిన మృణాల్ తెలుగు తెరపై కూడా మెరిసింది. సీతారామంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా, యువరాణి పాత్రలో చక్కని అభినయాన్ని పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ భామ. తాజాగా నాని నటిస్తోన్న 30వ సినిమాలోనూ నటిస్తోంది. అటు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయని వినికిడి.