ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పూర్తిగా బెడ్ రెస్ట్‌కు పరిమితం అయ్యారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తన అద్భుతమైన సంగీతంతో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. దాదాపుగా మూడు దశాబ్దాల కెరీర్లో వందలాది హిట్ సాంగ్స్‌ను కంపోజ్ చేశారు. కమర్షియల్ సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్‌ను ఎంతబాగా కంపోజ్ చేస్తారో.. ఆధ్యాత్మిక సినిమాల్లో భక్తిరక గీతాలకు అంతేబాగా బాణీ కడతారాయన. అందుకే యువత నుంచి వృద్ధుల వరకు కీరవాణి పాటలంటే చెవులు కోసుకుంటారు. ఇక, తన సోదరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో కీరవాణి ఇచ్చే మ్యూజిక్ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. జక్కన్న చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లకు ఆయన ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్కు థియేటర్లు దద్దరిల్లాల్సిందే.
కీరవాణి-రాజమౌళి కాంబోలో వచ్చిన మరో మూవీనే ‘ఆర్ఆర్ఆర్’. విడుదలైన ప్రతిచోటా కలెక్షన్ల జాతర చేసింది ‘ఆర్ఆర్ఆర్’. ఇక పురస్కారాల్లోనూ తన సత్తా చూపించింది. హాలీవుడ్లో ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించిందీ మూవీ. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం దక్కిన విషయం విదితమే. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఆస్కార్ కార్యక్రమం ముగిసిన అనంతరం స్వదేశానికి చేరుకున్న కీరవాణి.. పూర్తిగా బెడ్రెస్ట్కే పరిమితం అయ్యారని సమాచారం.
స్వయంగా కీరవాణి ఒక హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ఆస్కార్ వేడుకల్లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రయాణాలు చేయడంతో ఆయన బాగా అలసిపోయారట. ఒంట్లో నలతగా ఉండటంతో కీరవాణి విశ్రాంతి తీసుకుంటున్నారట. ఆయన పూర్తిగా బెడ్‌కు పరిమితం అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే, రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పనుల్లో జక్కన్న, మహేష్, కీరవాణితో పాటు మూవీ టీమ్ బిజీ అవుతారని తెలుస్తోంది.