సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా చిత్రాలు రిలీజ్ అవుతూంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షుల్లో బజ్ ను క్రియేట్ చేస్తుంటాయి. అలా గతంలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసుకున్న సినిమా ‘శక్తి’. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా గోవా బ్యూటీ ఇలియాన హీరోయిన్ గా నటించిన సినిమా శక్తి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన శక్తి.. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ మెహర్ రమేశ్ శక్తి మూవీ గురించి పలు సంచలన విషయాలు వెల్లడించారు. శక్తి సినిమా ఆడదని అశ్వనీదత్ కు ముందే చెప్పినట్లు ఆయన వివరించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మెహర్ రమేశ్.. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. తెలుగు సినీ పరిశ్రమలో స్టైలిష్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘కంత్రి’ మూవీతో తెలుగు సినీ పరిశ్రమకు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ తో ‘బిల్లా’, వెంకటేష్ తో ‘షాడో’ లాంటి సినిమాలు చేశాడు. అవి అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో తీసిని ‘శక్తి’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. ఈ సారి గ్యారంటీగా ఇండస్ట్రీ హిట్ కొడతాడు అనుకున్నారు అంతా.. కానీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది శక్తి. అయితే ఇంతలా డిజాస్టర్ అయినా గానీ సినిమాకు మనీ పరంగా నష్టం అయితే రాలేదని తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో మెహర్ రమేశ్ తెలిపాడు.
శక్తి మూవీ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుతూ..”బిల్లా మూవీని నాలుగున్నర నెలల్లో తీశాం. అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా. ఇక శక్తి సినిమాను చాలా కంట్రీస్ తిరిగి తీశాం. బడ్జెట్ పరంగా నిర్మాత అశ్వనీదత్ గారికి మంచి లాభాలు వచ్చాయి. మనీ పరంగా వర్కౌట్ అయ్యింది కానీ.. థియేటర్ల దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది” అని రమేశ్ తెలిపారు. ఈ క్రమంలోనే మీకు అశ్వనీదత్ గారు ఈ సినిమా విషయంలోగానీ, బడ్జెట్ విషయంలోగానీ మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారుగా.. మరి ఎందుకు మూవీ పోయింది. అని యాంకర్ అడగ్గా.. ఆయన సమాధానం ఇస్తూ..”ముందు నేను అశ్వనీదత్ కు చెప్పిన కథ ఒకటి. తర్వాత రాను రాను తీసిన కథ ఒకటి. నేను ఆయనకు కథ చెప్పగానే.. ఆయన నాకు కొంత మంది రైటర్స్ ను ఇచ్చాడు. గంధం నాగరాజు, యండమూరి వీరేంద్రనాథ్ వంటి ఉద్దండులను ఇచ్చారు. కథలోకి డివోషనల్ జోడించడం పెద్ద మైనస్ గా మారిందని” ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
అదీ కాక షూటింగ్ చేసే క్రమంలో దత్ గారికి నేను చెప్పాను.. సర్ ఈ కథ నాకే అర్ధం కాట్లేదు. ఇది ఆడదు.. దీన్ని ఇలానే ఉంచి నేను చెప్పిన కథ చేద్దాం అని. అయినప్పటికీ నేను శక్తి సినిమాను చాలా స్టైలిష్ గానే తీశాను. నేను చాలా సార్లు దత్ గారికి చెప్పి చూశాను, చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి” అని మెహర్ రమేశ్ అన్నాడు. ఇక పరాజయాలపై మీమ్స్ పై చాలా సరదాగానే స్పందిస్తానని నవ్వుతూ చెప్పారు మెహర్. సినిమా విజయానికి, పరాజయానికి డైరెక్టరే బాధ్యత వహించాలని అన్నారు. చాలా గ్యాప్ తర్వాత.. మెహర్ రమేశ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.