మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటేనే తెలుగు సినీ అభిమానుల్లో ఓ మెగా పవర్ పాస్ అవుతుంది. ఆయన వెండితెరపై కాలు కదిపితే కూర్చున్నవారు సైతం లేచి స్టెప్పులేయాల్సిందే. ఎప్పుడెప్పుడు ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటాయా అని ఎదురుచూసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ నుండి తాజాగా విడుదలైన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా ఫ్యాన్స్ నైతే ఆకట్టుకుంది. కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలో చిరంజీవిపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. అయితే.. ఒక్క సినిమాకే ట్రోల్స్ కి గురయ్యే స్థాయి ఆయనది కాదనే సంగతి అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో ఆయన చూడని బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్స్ లేవు.. బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఆయనకు కొత్తకాదు.
సినిమా ప్రపంచంలో ఒక్కడిగా మొదలైన మెగాస్టార్.. ఒక శిఖరంగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. ఇప్పుడు చెప్పుకుంటున్న ఎందరో హీరోలు, డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు మిమ్మల్ని వెండితెరపై చూసి ఈ రంగంలో అడుగుపెట్టాం.. మీరే మాకు ఆదర్శం అని చెప్పడం ఇప్పటికే కొన్ని వందలసార్లు చూసుంటాం. చిరంజీవిగా తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించిన కొణిదెల శివశంకర వర ప్రసాద్.. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటివరకు మెగాస్టార్ సినీ జీవితంలో సాధించిన రికార్డులు, అధిరోహించిన శిఖరాలను గుర్తుచేస్తూ ఓ అభిమాని రాసిన ఓపెన్ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఆ లెటర్ లోని విశేషాలేంటో చూద్దాం.
“ఆపద్బాంధవుడు సినిమాకి రూ.1.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని ఇండియన్ సినిమా చరిత్రలో ఒక్క సినిమాకి కోటీ పాతిక లక్షల పారితోషకం తీసుకున్న హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు. అప్పట్లో అమితాబ్ బచ్చన్ ను కూడా దాటేసిన ఆయన గురించి.. ద వీక్ అనే జర్నల్ కవర్ పేజ్ మీద ‘బిగ్గర్ దాన్ బిగ్ బి’ అని చిరంజీవి ఫొటో ముద్రించారు.
1987లో లాస్ ఎంజెల్స్ కాలిఫోర్నియాలో జరిగిన 59వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవానికి చిరంజీవి హాజరయ్యారు. అప్పట్లో సౌత్ ఇండియా నుంచి అకాడమీ అవార్డ్స్ కు పిలుపు అందుకున్న మొట్ట మొదటి సౌత్ ఇండియన్ నటుడిగా చిరంజీవి రికార్డు సృష్టించారు.
ఇండియన్ సినిమా చరిత్రలో రూ.7 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్న మొట్టమొదటి నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డు సృష్టించారు.
ఆ సమయంలో లగాన్ సినిమాకి రూ.6 కోట్లు పారితోషకం తీసుకుని అమీర్ ఖాన్ ఆయన తర్వాతి స్థానంలో నిలిచాడు.
టాలీవుడ్ చరిత్రలో మొట్ట మొదటిసారి బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా మెగాస్టార్ చిరంజీవిదే. 1992లో విడుదలైన ఘరానా మొగుడు సినిమా రూ.10 కోట్లు వసూళ్లు చేసి రికార్డులు తిరగ రాసింది.
టాలీవుడ్ చరిత్రలో మొట్ట మొదటిసారి బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా మెగాస్టార్ చిరంజీవిదే. 2002లో విడుదలైన ఇంద్ర సినిమా రూ.30 కోట్లు వసూళ్లు చేసి.. బాక్సాఫీస్ కా బాద్ షా చిరంజీవి అని మరోసారి నిరూపించింది.
టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్లు నెలకొల్పిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన తీసిన ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్.. ఈ సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లే.
ఉత్తమ నటుడిగా ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు, 3 నంది అవార్డులు పొందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.
ఏపీ, తెలంగాణలో టాలీవుడ్ లో డైరెక్ట్ వందరోజులు ఆడిన సినిమాలు చిరంజీవి కెరీర్లో 47 ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ సాధించిన రికార్డులు, రివార్డులు, ఆయన సెట్ చేసిన బెంచ్ మార్కులు లెక్కలేనన్ని ఉన్నాయి. అన్నింటికీ మించి ఆయనంటే పడి చచ్చిపోయే కోట్లమంది అభిమానులు ఆయన సొంతం. మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకోకపోయినా.. ఎవరు అంగీకరించకపోయినా తెలుగు సినిమాకి ఆయనే పెద్దన్నయ్య అందరికీ తెలుసు. కాబట్టి ఒక్క సినిమాని చూపించి ఆయనను ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. 9 సంవత్సరాలు సినిమాలకి బ్రేక్ ఇచ్చినా.. ఇప్పటికీ ఆయనే ఏకైక మెగాస్టార్ గా కొనసాగుతున్నారంటే ఆయన రేంజ్, క్రేజ్, స్టామినా గురించి సెపరేట్ ఎలవేషన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదనే విషయం అర్థమయ్యే ఉంటుంది” అంటూ అభిమాని లెటర్ లో చెప్పుకొచ్చాడు. మరి వైరల్ అవుతున్న ఈ ఓపెన్ లెటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.