తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులు, కళాతపస్వి కే. విశ్వనాథ్ మృతిపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. ‘ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు ఆయన.
ఆయన దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా ఆయన కైలాసానికి ఏతెంచారు.
ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.’ అంటూ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. కాగా.. కే.విశ్వనాథ్ చివరి రోజుల్లోనూ చిరంజీవి పలుమార్లు ఆయన ఇంటికి వెళ్లి కలిసే వారు. ఏ సందర్భంగా వచ్చినా.. విశ్వనాథ్ గారి గొప్పతనం స్మరించుకుంటూ.. ఎప్పుడూ ఆయనకు ఒక ప్రియశిష్యుడిలానే చిరంజీవి ఉన్నారు.
Shocked beyond words!
Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z— Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023