మెగాస్టార్, అన్నయ్య, అందరివాడు ఇలాంటి ఎన్ని పేర్లు పెట్టినా కూడా ఆయనకు తక్కువనే చెప్పాలి. ఇండస్ట్రీ పెద్దరికాన్ని నేను తీసుకోను.. కానీ, అవసరం వచ్చినప్పుడు మాత్రం కొమ్ముకాస్తాను అనే మాటలను మెగాస్టార్ చేతల్లో చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ విషయాన్ని చేసిచూపించారు కూడా. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆపదలో ఉన్నామంటూ ఎవరు ఆయన ఇంటి తలుపు తట్టినా కాదనకుండా సాయం చేస్తారు. తాజాగా ఆయన దానగుణం, సేవా తత్పరతను మరోసారి నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అలనాటి నటి పాకీజాకు మెగాస్టార్ ఆపన్నహస్తం అందించారు.
అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజాగా నటించిన వాసుకీ గురించి అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత ఆమె స్క్రీన్ నేమ్ కూడా పాకీజాగానే మారిపోయింది. ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో లేడీ కమేడియన్ గా నటించి మెప్పించారు. నిజానికి కోట్లు సంపాదించినా కూడా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలతో ఒక్క రూపాయిని కూడా కాపాడుకోలేకపోయారు. ఇటీవల చెన్నైలో ఉన్న ఆమెను సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యింది. పాకీజా దీనస్థితి చూసి ప్రేక్షకులు చలించిపోయారు. మెగా బ్రదర్ నాగబాబు పాకీజాకు లక్ష రూపాయలు ఆర్థికసాయం కూడా చేశారు. తెలుగు చిత్రాల్లో అవకాశాలు కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.
పాకీజాలాంటి ఒక గొప్ప నటి, కమేడియన్ తినడానికి తిండిలేని పరిస్థితిలో ఉందని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు. పాకీజాకు ఆర్థికంగా సాయపడాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. తెలుగు సినిమాలు, బుల్లితెర సీరియల్స్ లో పాకీజాకు ఒక పాత్ర ఇచ్చి ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయపడాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చిరంజీవితో ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా నాగబాబు, చిరంజీవి ఆర్థికంగా ఆదుకోవడంపై పాకీజా భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఒక ముద్ద తింటున్నాను అంటే అది తెలుగు వాళ్లు పెట్టిందే అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.