ఆయన దర్శకత్వం వహించిన మామన్నన్ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయింది.
ప్రముఖ తమిళ చలన చిత్ర దర్శకుడు మారీ సెల్వరాజ్ తన సినిమా కోసం పని చేసే నటులు, అసిస్టెంట్ డైరెక్టర్లపై చెయ్యి చేసుకుంటారని గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మారీకి కోపం వచ్చిన ప్రతీసారి.. సెట్టు మొత్తం భీభత్సంగా మారుతుందని, అసిస్టెంట్లపై ఆయన దాడి చేస్తాడని కొంతమంది మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఆ వార్తలు నిజం అనడానికి ఓ బలమైన సాక్ష్యం దొరికింది. ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్.. మారీ ప్రవర్తన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెపుకొచ్చారు. మారీకి కోపం వస్తే అసిస్టెంట్లను చావగొడతారని ఉదయనిధి అన్నారు. ఉదయనిధి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘‘ సినిమా షూటింగ్ సమయంలో చాలా టెన్షన్ పడ్డది డైరెక్టర్ సారే. అందర్నీ కొట్టేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్లందర్నీ కొట్టేవాడు. వాళ్లు గట్టిగట్టిగా అరిచే వాళ్లు. షూటింగ్ స్పాట్ మొత్తం యుద్ద భూమిలాగా ఉండేది. వాళ్లు ఓ వైపు అరిచే వాళ్లు.. కెమెరా మ్యాన్ మరోవైపు అరిచే వాడు’’ అని అన్నారు. మరో వీడియోలో ‘పనియారుమ్ పెరుమాల్’ సినిమాలో నటించిన నటుడు మారీ సెల్వన్ తన మీద చెయ్యి చేసుకున్నాడని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు మారీ సెల్వరాజ్ నన్ను కొట్టారు.
నన్ను కాఫీ తాగినట్లు నటించమన్నారు. నాకు రాలేదు. అప్పుడే హీరో సీన్‌లోకి వస్తాడు. నేను ఓ డైలాగ్ చెప్పాలి. నేను దాన్ని మర్చిపోయాను. దీంతో మారీ సెల్వరాజ్ టప్‌మని నా చెంప మీద కొట్టారు. నేను చాలా ఏడ్చాను. నేను సినిమా చేయనని చెప్పాను. నన్ను ఎంతో బతిమాలి మళ్లీ నటించేలా చేశారు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, మారీ సెల్వరాజ్.. ధనుష్‌తో కర్ణన్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఉదయనిధి, ఫాహద్ ఫాజిల్‌తో మామన్నన్ సినిమా చేశారు. ఆ సినిమా ఈనెల 29 ప్రేక్షకుల ముందుకు రానుంది.