ఆమె స్టార్ హీరోయిన్. సౌత్, నార్త్ తేడా లేకుండా స్టార్ హీరోలు, అద్భుతమైన డైరెక్టర్స్ తో సినిమాలు చేసింది. అయితే దక్షిణాదిలో తన కెరీర్ ముగిసిపోవడం గురించి తాజాగా ఓపెన్ అయింది.
మనీషా కొయిరాలా.. ఈ పేరు చెబితే ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చేమో గానీ 90స్ కిడ్స్ ని అడిగితే ఆమె గురించి ఆపకుండా వర్ణిస్తూనే ఉంటారు. స్వతహాగా నేపాలీ అయిన ఈమె.. నాగార్జున ‘క్రిమినల్’తో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సౌత్ లో పలు సినిమాల్లో కనిపించింది. ‘బొంబాయి’, ‘ఒకే ఒక్కడు’, ‘బాబా’ సినిమాలతో ఈమె పేరు మార్మోగిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా సౌత్ ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇప్పుడు ఆ విషయం గురించి చెబుతూ.. అప్పుడేం జరిగింది అనేది ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోలతో పోలిస్తే ఎక్కడైనా సరే హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే వాళ్లు నటించిన సినిమాలు హిట్ అవుతూ ఉండాలి. అప్పుడే జనాల్లో క్రేజ్ ఉంటుంది. నిర్మాతలు కూడా సదరు బ్యూటీస్ కి ఛాన్సులు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ ఏ మాత్రం ఫ్లాప్స్ వస్తే.. ఆ హీరోయిన్లకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా చెప్పాలంటే మొత్తానికి ఎక్కడా కనిపించకుండా పోతారు. హీరోయిన్ మనీషా కొయిరాలా విషయంలోనూ సేమ్ అదే జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బాబా’లో నటించిన తర్వాత సౌత్ లో మరో సినిమా చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పటి పరిస్థితుల గురించి వెల్లడించింది.
‘బాబా.. బహుశా నా చివరి భారీ తమిళ సినిమా. ఆ రోజుల్లో చాలా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద డిజాస్టర్. మూవీపై రిలీజ్ కు ముందు చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ఘోరంగా ఫెయిలయ్యేసరికి సౌత్ లో నా కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకున్నారు. కరెక్ట్ గా అదే జరిగింది. ‘బాబా’లో నటించడానికి ముందు నా చేతిలో దక్షిణాది సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయ్యేసరికి ఛాన్సులన్నీ పోయాయి’ అని హీరోయిన్ మనీషా కొయిరాలా చెప్పుకొచ్చింది. మరి మనీషా కొయిరాలా ఇన్నేళ్ల తర్వాత చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.