కృష్ణంరాజు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ దిగ్గజం. ఎలాంటి వర్గభేదాలు లేకుండా ఆయన పరిశ్రమలో కొనసాగారు. ఇక వయసు మీద పడడంతో చిత్రాలను తగ్గించారు. అప్పుడప్పుడు కొన్ని అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే అనుకోకుండా ఆయన ఇటీవల అనారోగ్యకారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. దాంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణంరాజు మరణం పరిశ్రమకి తీరని లోటు అని మా ప్రెసిడెంట్, సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మంగళవారం ఫిల్మ్ నగర్ లో కృష్ణంరాజు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా విష్ణు.. కృష్ణంరాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్నివివరాల్లోకి వెళితే..
“నేను మా ప్రెసిడెంట్ అయ్యను అంటే దానికి కారణం కృష్ణంరాజు అంకులే” అని మంచు విష్ణు అన్నారు. మంగళవారం జరిగిన సంతాప సభలో కృష్ణంరాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని హీరో మంచు విష్ణు గుర్తుకు చేసుకున్నారు. “నా చిన్నప్పటి నుంచి నేను కృష్ణంరాజు ఇంటికి వెళ్లేవాడిని. అంకుల్ కూడా మా ఇంటికి వచ్చేవారు. అదీ కాక నాన్నకు.. అంకుల్ కు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. ఆ చనువుతోనే నన్ను మా ఎన్నికల్లో కృష్ణంరాజు పోటీ చేయమన్నారు. అసలు నాకు ముందు ఫోన్ చేసి నువ్వు ఈ సారి మా ప్రెసిడెంట్ గా పోటీ చేయాలి అని చెప్పిందే రాజుగారు. నేను నిలబడటం నాన్నకు ఇష్టం లేదు కానీ అంకులే నాకు ఫొన్ చేసి దబాయించి “రేయ్ ఈ సారి నువ్వు నిలబడుతున్నావ్ అంతే” అన్నారు. దాంతో నేను ఆయన మాట కాదనలేక పోయాను. అదీ కాక నాన్న కృష్ణంరాజు గారిని చూసి.. కటౌట్ అంటే అలా ఉండాల్రా అంటూ మాకు చెప్పేవాడు.
అదీ కాక ప్రతీ నెల 10వ తారీఖు కల్లా “మా” అసోషియేషన్ కు సంబంధించిన లెక్కలు అన్నీ ఆయనకు సమర్పించేవాళ్లం. ఆ లెక్కల్లో తప్పులుగానీ ఉంటే మా తాటతీసేవారు. అందుకే మేం ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఇప్పుడు కూడా పత్రాలు అన్నీ రడీ చేసుకున్నాం.. కానీ ఇంతలోనే ఇలా జరగడం చాలా దురదృష్టకరం. మా ప్రెసిడెంట్ గా నేను ఈ సభ నిర్వహిస్తానని కలలో కూడా అనుకోలేదు” అంటూ మంచు విష్ణు భావోద్వేగానికి గురిఅయ్యారు. కృష్ణంరాజులో ఉన్న ఠీవి మరే ఇతర నటులలో కూడాలేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఏ వేడుకకు వచ్చినా గానీ ఆయన నడుస్తున్నప్పుడు ఓ గంభీరమైన, అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మన మనసుకు వినిపిస్తుందన్నారు. ఆయన ఓ దిగ్గజం.. మన మధ్యలేకున్నాగానీ వారి సినిమాలు కలకాలం మనతోనే ఉంటాయి అని విష్ణు అన్నారు. మరి కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మంచు విష్ణుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.