ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయంలో కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయని హీరో మంచు మనోజ్ అన్నారు. అలాంటి సమయంలో ధైర్యం కోల్పోకండా నిలబడాలని చెప్పారు. మనోజ్ ఎమోషనల్ స్పీచ్‌తో ఆయన భార్య మౌనిక కన్నీళ్లు పెట్టుకున్నారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికలు ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి అనేది విదితమే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఎట్టకేలకు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. మనోజ్‌ది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం, మౌనికది పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో వీరి మ్యారేజ్ మీద అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్-మౌనికల వివాహం జరిగింది. ఈ కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మార్చి 19న మోహన్ బాబు 71వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆడపిల్ల ఓడిపోతే లోకమే ఓడిపోతుందని మనోజ్ అన్నారు. జీవితంలో గెలుపోటములు సహజమని.. మనం చేసే ప్రయాణాన్ని అనుభూతి చెందాలన్నారు. అందరి జీవితాల్లో ఒక ఫేజ్ వస్తుందని.. గాఢాంధకారంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుందన్నారు మనోజ్. కానీ అక్కడే ఆగిపోకూడదని.. ముందుకు సాగాలని సూచించారు. తన జీవితంలోనూ అలాంటి ఓ ఫేజ్ వచ్చిందని.. ఆ సమయంలో తన ఫ్యామిలీ తనకు అండగా నిలబడిందన్నారు. ఆ టైమ్‌లో పాటలు రాసుకుంటూ, మ్యూజిక్ కంపోజ్ చేస్తూ గడిపానన్నారు మనోజ్.
‘నేను సినిమా చేసి ఆరేళ్లు అవుతోంది. అయినా నాకు ప్రేక్షకులు ఇంతమాత్రం ప్రేమ తగ్గించకుండా ఇస్తున్నారు. ఎన్ని జన్మలు ఎత్తితే ఇది దక్కుతుంది? నేను చీకట్లో ఉన్నప్పుడు మా కుటుంబం అండగా నిలబడింది. అప్పుడు ముందుకు వెళ్దామని అనుకుంటున్న టైమ్‌లో ఓ వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు పేరే మౌనిక. అప్పుడే నాకు అర్థమైంది ఏది దూరం పెట్టానో. నాకు సినిమాలు, సామాజిక సేవ అంటే ఇష్టం, ప్రేమ. అందుకే మళ్లీ మూవీస్ చేస్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి కూడా స్వేచ్ఛగా ఉండాలి. తను ఏం చేయాలనుకున్నా నేను మద్దతుగా ఉంటా. ప్రతి ఆడదాని గెలుపు వెనకాల ఓ మగాడు ఉండాలి’ అని మనోజ్ ఎమోషన్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు విని ఆయన భార్య మౌనిక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆడవాళ్లు గెలిస్తేనే మనం గెలిచినట్లు అని మనోజ్ చెప్పుకొచ్చారు.