నిన్నటి నుంచి సోషల్ మీడియా, మీడియా ఇలా ఎక్కడ చూసినా ఒకటే వార్త తెగ ప్రచారం అవుతోంది. అదే హీరో మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నారు అని. అది కూడా ఏపీకి చెందిన ఓ ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని మనోజ్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతకు మనోజ్ వివాహం చేసుకోబోయేది ఎవరిని అంటే.. ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డి కావడంతో ఈ వార్త తెగ వైరలయ్యింది. దీనికి బలం చేకూర్చుతూ.. మనోజ్-మౌనికారెడ్డి ఇద్దరూ జంటగా సీతాఫల్ మండిలో వినాయక మండపంలో సండది చేశారు.
ఈ క్రమంలో మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నారా అని ప్రశ్నించగా.. అందుకు మనోజ్.. మంచి రోజు చూసి చెబుతానంటూ సమాధానం ఇవ్వడం వైరల్‌గా మారింది. దాంతో వీరిద్దరి వివాహం పక్కా అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఇటు మంచు కుటుంబ నుంచి కానీ.. అటు భూమా కుటుంబం నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇక ఈ పెళ్లివార్తలు ప్రచారంలోకి రావడంతో ప్రసుత్తం నెటిజనులు భూమా మౌనికా రెడ్డి వివరాల కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. మౌనికా రెడ్డికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఇక ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లకి భూమా మౌనికారెడ్డి ఎవరో ఇట్టే అర్థం అవుతుంది. మాజీ ఎంపీ, దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి-శోభారాణి దంపతుల కుమార్తె భూమా మౌనికా రెడ్డి. కర్నూలు జిల్లా మరీ ముఖ్యంగా ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి మూడు సార్లు ఎంపీగా చేయగా.. శోభా నాగిరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇక ఈ దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం. అఖిలప్రియ, మౌనికా రెడ్డి, జగత్‌విఖ్యాత్ రెడ్డి.
మౌనికా రెడ్డి రెండో సంతానం. అసలు పేరు నాగ మౌనికా రెడ్డి. స్వస్థలం ఆళ్లగడ్డ అయినప్పటికి.. హైదరాబాద్‌లోనే వీరు జన్మించారు. విద్యాభ్యాసం ఇక్కడే పూర్తయ్యింది. మౌనికా రెడ్డి బీటెక్ పూర్తి చేసింది. విదేశాల్లో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఇక 2014లో తల్లి శోభారెడ్డి మరణం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో శోభానాగిరెడ్డి మృతి చెందారు. అప్పటి నుంచి తండ్రికి అండగా ఉన్నారు అఖిల ప్రియ, మౌనికా రెడ్డిలు.ఇక 2016లో మౌనికా రెడ్డికి చిత్తూరు జిల్లాలో జన్మించి.. బెంగళూరులో సెటిల్ అయిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో వివాహం అయ్యింది. ఆ తర్వాత 2017లో భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో.. ఆయన పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు.
ఇక 2018లో మౌనికారెడ్డి-గణేష్ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత రెండెళ్లకు మౌనికా రెడ్డి భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి అక్క అఖిలప్రియకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఈ క్రమంలో 2020, డిసెంబరలో బోయిన్‌పల్లిలో వెలుగు చూసిన కిడ్నాప్ వ్యవహారంతో భూమా మౌనికా రెడ్డి తెర మీదకు వచ్చింది. అప్పటి వరకు ఆమె గురించి సన్నిహితులకు మాత్రమే తెలుసు. అఖిల ప్రియ అరెస్ట్ తర్వాత మౌనికా రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. అక్కా, తమ్ముడు అరెస్ట్ తర్వాత మౌనికా రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి.. నియోజకవర్గంపై పట్టు నిలుపుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె అడపాదడపా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఇక భూమా, మంచు ఫ్యామీలీల మధ్య ఉన్న రాజకీయ సంబంధాల కారణంగా మనోజ్-మౌనికా రెడ్డిల మధ్య పరిచయం ఏర్పడిందని.. ప్రస్తుతం ఇద్దరూ హైదరాబాద్‌లోనే కలిసి ఉంటున్నారని సమాచారం. ఇక వివాహం చేసుకోవడానికన్నా ముందే మనోజ్, మౌనికలు వ్యాపార భాగస్వాములు అయినట్లు తెలుస్తోంది. ఎంఎం ప్యూరిటీ అనే మెడికల్ అప్లయన్స్, ఇన్‌స్ట్రూమెంట్స్ తయారు చేసే ఈ కంపెనీకి మనోజ్, మౌనికా రెడ్డి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 2021, ఆగస్టులో ఈ కంపెనీని ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే నిజజీవితంలో భాగస్వాములు అవుతారో లేదో చూడాలి.
ఇక మనోజ్ విషయానికి వస్తే.. ఆయనకు 2015లో హైదరాబాదుకు చెందిన ప్రణతి రెడ్డితో వివాహం అయ్యింది. తన సోదరుడు మంచు విష్ణు వివాహంలో పరిచయమైన ప్రణతి రెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు సంతోషంగా కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. విడాకలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2019లో విడిపోయారు. ఆ తర్వాత నుంచి మంచు మనోజ్ సింగల్‌గానే ఉంటున్నాడు. దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు భూమా మౌనికతో కలిసి కనిపించడంతో వీరిద్దరికీ వివాహం జరగబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక మనోజ్ చివరి సారిగా అహం బ్రహ్మస్మి అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.