టాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టార్ కిడ్స్‌లో మంచు లక్ష్మి ముందు వరుసలో ఉంటారు. ఆమె కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా, హోస్ట్‌గా, సింగర్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. తెలుగులో ఆమె పలు స్టార్ టాక్ షోలు చేశారు. ప్రస్తుతం ఓ ప్రముఖ తెలుగు ఓటీటీలో ‘‘ఆహా భోజనంబూ’’ అనే కుకింగ్ షో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సెలెబ్రిటీలతో షో హోస్ట్ చేయటం ఎంత కష్టమో వివరించారు. ఓ సారి అనుష్క శెట్టి విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఓ సారి అనుష్క శెట్టి నా షోకు వస్తానని అంది. ఆల్‌రెడీ కన్ఫార్మ్ కూడా చేసేసింది.
కానీ, ఓ రెండు రోజులు తనకు నాకు మధ్య కాంటాక్ట్ లేకపోయింది. తను భాగమతి సినిమా ప్రమోషన్స్ కోసం రాజమండ్రికో.. ఎక్కడికో వెళ్లింది. నేను తనను కాంటాక్ట్ అవ్వటం కుదరలేదు. నాలో భయం మొదలైంది. ఎందుకంటే నా షో ఆమెతోనే స్టార్ట్ అవుతుంది. నేను తనకు పూలు పంపాను, తన బెస్ట్ ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాను. చాలా రకాలుగా ప్రయత్నించాను. ఓ నాలుగు, ఐదు రకాలుగా ప్రయత్నించాను. అనుష్క ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఇళ్లు మెసేజ్‌లతో నిండిపోయి ఉంది. తను థ్రిల్ అయింది. తను నాకు ఫోన్ చేసి ‘‘నేను వస్తానని చెప్పానుగా’’ అని అంది.
నేను జరిగింది చెప్పి.. ‘‘భయపడ్డాను.. నువ్వు వస్తావని నాకు సరిగ్గా తెలీదు. అందుకే ఇలా చేశాను’’ అని అన్నాను. వాళ్లు మన షో కోసం టైం చేసుకుని వస్తున్నారు కాబట్టి వాళ్లతో ప్రేమగా వ్యవహరించాలి. గౌరవంగా చూసుకోవాలి. ఏయ్ రావే అనటం కాదు. నేను ఇలా అనే వాళ్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. రానా, రకుల్, తాప్సి .. ఏయ్ రండే అంటే వచ్చేస్తారు. వాళ్లకు నా మీద అంత ప్రేమ. నేను వారం వారం కలిసే ఫ్రెండ్స్ అయినా సరే.. వాళ్లను షోకు తీసుకురావటానికి పళ్లు లాక్కోవాలి. నార్త్ లాగా సౌత్‌లో టీవీ షోలకు అంతగా రారు’’ అని చెప్పుకొచ్చారు.