ఆడ, మగా తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు.. ఆకర్షణీయంగా.. అందంగా కనిపించాలని భావిస్తారు. సెలబ్రిటీలకు అందమే పెట్టుబడి అని చెప్పవచ్చు. వారి ఫిజిక్‌లో ఏమాత్రం తేడా వచ్చినా తెగ కంగారు పడతారు. అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక సినిమా పరిశ్రమలో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలు.. హీరో, హీరోయిన్‌గా రాణించాలంటే.. ప్రధానంగా ఉండాల్సింది అందం. బ్యూటీ విషయంలో ఏమాత్రం తేడా వచ్చిన.. ఇక వెండితెరకు దూరమవ్వాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో.. తీవ్ర, అరుదైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. సమంత మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ మమతా మోహన్‌దాస్ విటిలిగో(బొల్లి) సమస్యతో బాధపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా తనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ వివరాలు..
ఇటీవలే క్యాన్సర్, హాడ్కిన్స్ లింఫోమా వంటి వ్యాధుల బారినపడి.. వాటి నుంచి కోలుకున్న మమతా మోహన్‌దాస్.. తాజాగా మరో అనారోగ్య సమస్య బారిన పడింది.. అదే ‘బొల్లి’. దీన్నే వైద్య పరిభాషలో విటిలిగో లేదా ఆటోఇమ్యూన్ డిసీజ్ అని కూడా అంటారు. తాజాగా తాను బొల్లి వ్యాధి బారిన పడినట్లు.. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తాను విటిలిగో బారిన పడ్డానని.. ఫలితంగా తన శరీరం రంగును కోల్పోతుందని.. వెల్లడించింది. మరి ఇంతకు ఈ బొల్లి సమస్య ఎలా ఏర్పడుతుంది.. నివారణ మార్గాలు ఏంటి.. పూర్తిగా నయమవుతుందా వంటి వివరాలు..
బొల్లి అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్. దీని వల్ల చర్మం మొత్తం కాకుండా.. అక్కడక్కడ రంగు కోల్పోతుంది… కలర్‌లో కూడా మార్పు వస్తుంది. దీనికి కారణం పిగ్మెంట్లను తయారు చేసే చర్మ కణాలైన మెలనోసైట్లపై దాడి చేయడం.. అవి నశించడం వల్ల చర్మం తెల్లరంగులోకి మారుతుంది.
ఈ వ్యాధి ఏర్పడటానికి ప్రధాన కారణం.. శరీర రోగనిరోధక వ్యవస్థ మెలనోసైట్‌లపై దాడి చేసి నాశనం చేయడం వల్లే బొల్లి సమస్య తలెత్తుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. అంతేకాక మానసిక ఆందోళన, వడదెబ్బ, రసాయానల పదార్థాలు వంటి కారణాలు వల్ల కూడా బొల్లి సమస్య తలెత్తుతుంది. అలానే బొల్లి ఏర్పడినప్పుడు ప్రధానంగా కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి.
మరి బొల్లి వ్యాధికి శాశ్వత నివారణ, చికిత్స ఉంటాయా అంటే.. లేవనే చేబుతున్నారు వైద్య నిపుణులు. బొల్లి వ్యాధికి శాశ్వత చికిత్స లేదు. కాకపోతే.. ఇది మరింత ప్రభావితం చేయకుండా డిపిగ్మెంటేషన్‌ను నిరోధించాలి. ఇందుకుగాను సూర్యరశ్మి ఎక్కువ తగలకుండా జాగ్రత్తపడాలి. అలానే నారో-బ్యాండ్ యూవీబీ ఫోటోథెరపీ ద్వారా బొల్లి వ్యాప్తిని నియంత్రించవచ్చు. కార్టికోస్టెరాయిడ్స్ లేదా కాల్సినూరిన్ ఇన్హిబిటర్లతో సైతం బొల్లిని అడ్డుకోవచ్చు. ప్సోరాలెన్, లైట్ థెరపీ ద్వారా కూడా బొల్లి మచ్చలను కంట్రోల్ చేయొచ్చు. అలాగే మారిన కలర్‌ను కూడా సాధారణ రంగులోకి మార్చుకోవచ్చు. కానీ గ్యారంటీ లేదు అంటున్నారు వైద్య నిపుణులు.