నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కలెక్షన్స్‌లో బాలయ్య గత చిత్రం ‘అఖండ’ను ‘వీరసింహారెడ్డి’ అధిగమించింది. తనదైన శైలిలో భారీ ఫైట్లు, మాస్ డైలాగులతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్‌కు బాలయ్య పూనకాలు తెప్పించాడు. బిగ్ స్కీన్లలో హిట్‌గా నిలిచిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మీద ఇంకా క్లారిటీ రాలేదు.
‘వీరసింహారెడ్డి’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇకపోతే, ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వెల్లడించారు. ‘వీరసింహారెడ్డి’ సినిమా కథ, హీరో పాత్రను రాసుకున్న విధానం, దీనికి స్ఫూర్తి ఎవరనేది ఆయన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మాజీ టీడీపీ నేత పరిటాల రవిని ఊహించుకుని వీరసింహారెడ్డి పాత్రను రాసుకున్నానని తెలిపారు. హీరో పాత్ర రాసే సమయంలో తన ఇమాజినేషన్‌లో పరిటాల రవి ఉన్నారని చెప్పారు. సినిమా కోసం ఆయన జీవితంలోని కొన్ని ఘటనలను స్ఫూర్తిగా తీసుకున్నానని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.
‘పరిటాల రవికి ప్రమాదం ఉందని ఓ పేపర్‌లో చదివాను. ఆయనను కొంతమంది ఎన్ఆర్ఐలు యూఎస్ రమ్మన్నారు. అయితే తాను పుట్టింది ఇక్కడే.. కాబట్టి చనిపోయినా ఇక్కడే అని పరిటాల వద్దన్నారని ఆ పేపర్ ఉంది’ అని గోపీచంద్ మలినేని అన్నారు. పరిటాల జీవితంలోని కొన్ని ఘటనల స్ఫూర్తితో ‘వీరసింహారెడ్డి’ పాత్రతో పాటు ఆ మూవీ ఇంటర్వెల్ బ్లాక్‌ను డిజైన్ చేసుకున్నానని గోపీచంద్ వివరించారు. మరి, ‘వీరసింహారెడ్డి’ పాత్రను పరిటాల రవి స్ఫూర్తితో మలిచానంటున్న గోపీచంద్ మలినేని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.