సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్, అవకాశం కోసం లొంగదీసుకున్నారు. ఛాన్స్ ఇస్తానని మోసం చేశారు.. వంటి ఆరోపణలు వింటూనే ఉంటాం. అలాంటి జాబితాలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఇలా చాలా మంది పేర్లు విన్నాం. తాజాగా ఆ జాబితాలోకి మరో డైరెక్టర్ పేరు చేరింది. సినిమా యూనిట్ లోని ఓ యువతి డైరెక్టర్ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆ డైరెక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ హీరోగా నటిస్తున్న పడవెట్టు సినిమా డైరెక్టర్ లిజు కృష్ణపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. పడవెట్టు సినిమా బృందంలోని ఓ యువతి లిజు కృష్ణ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో డైరెక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుండగా.. లిజు కృష్ణ పోలీసు కస్టడీలో ఉండటంతో షూటింగ్ వాయిదా పడింది.
మలయాళ పొలిటికల్ డ్రామాగా పడవెట్టు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నివిన్ పాలీ, మంజు వారియర్, అదితి బాలన్, షమ్మీ తిలకన్, షైన్ టామ్ చికో, ఇంద్రన్స్, సుధీష్, విజయరాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పడవెట్టు కథ కూడా లిజు కృష్ణనే రాశాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.