నటీనటులు: అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: ఎస్. వినయ్ కుమార్, పవన్ కళ్యాణ్ కే
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కథ, స్క్రీన్ ప్లే: అడివి శేష్
నిర్మాతలు: మహేష్ బాబు, నమ్రత, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
దర్శకత్వం: శశికిరణ్ టిక్కా
చిత్రపరిశ్రమలో దేశంకోసం ప్రాణత్యాగాలు చేసిన వీరుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం అనేది గొప్ప విషయంగానే చెప్పాలి. ఎందుకంటే.. వారు ఏం చేశారు అనేదానికంటే ఎలా బ్రతికారు అనేది ఎంతోమందిలో స్ఫూర్తి కలిగిస్తుంది. ఇదివరకు బాలీవుడ్ లో బయోపిక్స్ తెరకెక్కిన సినిమాలు చూసాం.. కానీ తెలుగులో కూడా ఇప్పుడు మేజర్ సినిమాతో సరికొత్త ట్రెండ్ మొదలుకానుందని చెప్పవచ్చు. టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేజర్. క్షణం గూఢచారి, ఎవరు లాంటి వరుస విజయాల తర్వాత శేష్ నుండి ప్రేక్షకుల ముందుకొచ్చింది మేజర్ చిత్రం.
26/11 ముంబై ఉగ్రదాడులలో ప్రాణాలు కోల్పోయిన సోల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందునుండే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ప్రివ్యూలు ప్రదర్శిస్తున్నా.. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి టాక్ బయటికి రాలేదు. శేష్ తో గూఢచారి సినిమా తెరకెక్కించిన శశికిరణ్ టిక్కా మేజర్ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు అన్నివిధాలా పాజిటివ్ హైప్ క్రియేట్ అయింది. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడం మరో విశేషం. జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన మేజర్ సినిమా విశేషాలేంటో రివ్యూలో చూద్దాం!
కథ:
మేజర్ సినిమా కథ.. ముందునుండి చెప్పినట్లుగానే కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని ప్రధాన అంశాలను బేస్ చేసుకొని రూపొందించారు. అతని చిన్నతనం నుండి ఫ్యామిలీ ఎమోషన్స్, గోల్స్.. లవ్.. ఆర్మీ సైనికుడిగా ఎదిగిన తీరు.. చివరికి ముంబై దాడుల్లో సందీప్ ప్రాణాలు వదిలిన విధానాన్ని చాలా మనసుకు హత్తుకునే కథగా చూపించారు. కేరళలో పుట్టిపెరిగిన సందీప్(అడివి శేష్).. చిన్నతనంలోనే సోల్జర్ అవ్వాలని ఫిక్స్ అయిపోతాడు. కానీ పేరెంట్స్(ప్రకాష్ రాజ్, రేవతి) మాత్రం డాక్టర్, ఇంజనీర్ కావాలని కోరుకుంటారు. కాలేజీ టైంలో క్లాస్ మెట్ ఇషా(సయీ మంజ్రేకర్)తో ప్రేమలో పడతాడు సందీప్. ఆ తర్వాత సందీప్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎలా ఎదిగాడు? ఎలాంటి పరిస్థితిలో ఇషాను పెళ్లి చేసుకుంటాడు? తల్లిదండ్రులను కాదని ఆర్మీలో చేరిన సందీప్ వారికీ ఎలాంటి సమాధానం చెప్పాడు? చివరిగా ముంబై ఉగ్రదాడుల్లో ఎలా ప్రాణాలు విడిచాడు? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నప్పుడే మేకర్స్ సగం విజయం సాధించేసారని చెప్పాలి. 26/11 ఉగ్రదాడులను భారతీయులు ఎప్పటికి మర్చిపోలేరు. ఆ దాడుల్లో ఎంతోమందిని తన బృందంతో కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ కథను తెరపైకి తీసుకురావడానికి ఎంతకష్టపడ్డారో.. అంతే విజయాన్ని సాధించారు దర్శకనిర్మాతలు. ఓ రియల్ హీరో జీవితకథ ఆధారంగా తెలుగులో తెరకెక్కిన మొదటి సినిమాగా మేజర్ పేరు ఎప్పటికి నిలిచిపోతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడు అనేది జనాలు మాట్లాడుకోకూడదు.. అతను ఎలా బ్రతికాడు? అనేది గొప్పగా చెప్పుకోవాలంటూ తెరపై ఆవిష్కరించింది చిత్రబృందం. మేజర్ సినిమాను ఎన్ని ఎమోషన్స్ తో తెరకెక్కింది అనేది ట్రైలర్ లో చూపింది పదిశాతమే.
మేజర్ సందీప్ పాత్రలో నటుడు అడివి శేష్ జీవించేసాడు. సినిమా చూస్తున్నంతసేపు మనకు శేష్ ఎక్కడా కనిపించడు. మేజర్ సందీప్ మన కళ్ళముందు రియల్ గా పోరాడుతున్నాడు అనే ఫీల్ చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ని, క్యారెక్టర్ బిహేవియర్ ని చాలా బాగా రాసుకున్నారు. అలాగే కథలో ట్విస్టులను, సందీప్ లైఫ్ లోని టర్నింగ్ పాయింట్ లను స్క్రీన్ ప్లేలో చక్కగా పొందుపరిచారు. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి హిట్స్ తో ఆల్రెడీ అడివి శేష్ క్రియేటివ్ రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈసారి మేజర్ సినిమాతో కూడా శేష్ రైటింగ్ స్కిల్స్ టాప్ నోచ్ అని మరోసారి ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా మేజర్ సందీప్ క్యారెక్టరైజేషన్ ని పక్కాగా డిజైన్ చేసుకున్నారు.
ఈ సినిమాలో ఎక్కడకూడా ఈ సీన్ అవసరం లేదుకదా అనిపించకుండా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంత ఎంగేజింగ్ గా సాగడానికి శేష్ స్క్రీన్ ప్లే, ఎడిటర్స్ వినయ్ కుమార్, పవన్ కళ్యాణ్ ల రోల్ ప్రధాన కారణం. మేజర్ సినిమాను ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ ఎండ్ కార్డు వరకు పకడ్బంధీగా డెవలప్ చేశాడు దర్శకుడు. ఇలాంటి ఆర్మీ ఆపరేషన్స్ చూపించేటప్పుడు ప్రొడక్షన్ డిజైన్ ది మేజర్ రోల్ ఉండాలి. మేజర్ సినిమాకు ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ప్రొడక్షన్ వేల్యూస్ విషయంలో ఎలాంటి డోకా లేదు. నిర్మాతలు మేజర్ ని త్రిభాష చిత్రంగా కాకుండా పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.
ఇక రా యాక్షన్ సినిమాలకు ఉత్కంఠ రేపే కథా
కథనాలతో పాటు సినిమాటోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుకోవాలి. మేజర్ కి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ ప్రధాన బలం అనే చెప్పాలి. సన్నివేశాలకు కావాల్సిన విధంగా తన కెమెరా పనితనాన్ని ప్రదర్శించాడు. అలాగే సినిమా అంతాకూడా ఆసక్తికరంగా నడిపించాడు. ముఖ్యంగా ముంబై దాడుల యాక్షన్ సీక్వెన్స్ అంతబాగా ఆకట్టుకున్నాయంటే క్రెడిట్ వంశీతో పాటు.. డైరెక్టర్ శశికి దక్కుతుంది. అలాగే మేజర్ కి బ్యాక్ బోన్ అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. శ్రీచరణ్ పాకాల పాటలు బాగున్నాయి. నేపథ్యసంగీతం అంతకన్నా బాగుంది. సరైన సినిమా దొరికితే ఎలా ఇస్తాడో.. శ్రీచరణ్ శాంపిల్ చూపించాడు. ఇంకా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ గురించి.. రైటర్ అబ్బూరి రవి చాలాకాలం తర్వాత తన పెన్ పవర్ చూపించే ప్రయత్నం చేశాడు.
ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సందీప్ ఎమోషన్స్ ని తన మాటలతో చాలా బాగా ఎలివేట్ చేశారు. ఇక సినిమాలో చివరిగా యాక్టర్స్ గురించి చెప్పుకోవాలి. మేజర్ సందీప్ పేరెంట్స్ గా ప్రకాష్ రాజ్, రేవతి వందశాతం న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్స్ లో వారి నటన పీక్స్ లో ఉంటుంది. చివరిలో ఏడిపిస్తారు కూడా. అలాగే మేజర్ భార్య ఇషాగా సయీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో కుదురైన నటన కనబరచింది. మేజర్ సందీప్ టీమ్ సూపర్వైసర్ మేజర్ షేరా పాత్రలో మురళీ శర్మ ఆదరగొట్టేసాడు. ఆయనకు పోలీస్, ఆర్మీ రోల్స్ కొత్తకాదు. కానీ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా మురళీ శర్మ మెప్పించారు. సినిమాలోని అన్నీ పాత్రలకి నటులు అద్భుతంగా రాణించారు. స్పెషల్ రోల్ ప్రమోదరెడ్డి క్యారెక్టర్ లో శోబిత ధూళిపాళ న్యాయం చేసింది. మొత్తంగా మేజర్ సినిమా.. మేజర్ సందీప్ పేరును పాన్ ఇండియా స్థాయిలో మోతమోగించి.. మనసులను గెలుచుకున్నారని చెప్పవచ్చు.
ప్లస్ లు:
*ప్రధాన తారాగణం నటన
*గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
*బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
*సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్
*డైరెక్షన్
చివరిమాట:
గుండెను హత్తుకునే యాక్షన్ ప్యాకెడ్ మేజర్ కథ ఇది!