‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి పేరు వరల్డ్ వైడ్ మార్మోగిపోతోంది. ఏ దేశానికి వెళ్లినా సరే ప్రతి ఒక్కరూ, జక్కన్న మేనియాలో ఊగిపోతున్నారు. ఇక తాజాగా ఈ దర్శకుడికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు దక్కడంతో తెలుగు సినీ ప్రేమికులు తెగ ఆనందపడిపోతున్నారు. తమకు దొరికిన అద్భుతమైన డైరెక్టర్ రాజమౌళి అని పొంగిపోతున్నారు. దీంతో రాజమౌళి పేరు మాత్రమే కాదు.. టాలీవుడ్ పేరు విశ్వవ్యాప్తమైంది. ఈ క్రమంలోనే జక్కన్న తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు దానికి ఇంకాస్త ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీస్తానని రాజమౌళి ఎప్పుడో చెప్పేశాడు. ఈ విషయంలో పెద్దగా డౌట్స్ లేవు. కానీ ఎలాంటి సినిమా తీస్తాడనేది ఫ్యాన్స్ కి పెద్ద ప్రశ్నలా మారిపోయింది. దీనికి సమాధానం చెబుతూ.. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫుల్ ఆన్ యాక్షన్ ఉంటుందని హింట్ ఇచ్చేశాడు. దీంతో ఈ ప్రాజెక్టుపై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు దీనికి మరింత బలం చేకూర్చేలా రాజమౌళి తండ్రి, రైటర్ కె.విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి అదిరిపోయే విషయాలు చెప్పారు.
‘మహేశ్ బాబు లాంటి నటుడికి కథ రాయాలనేది చాలామంది రైటర్స్ డ్రీమ్. ఆయన ఓ ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్. మహేశ్ గత సినిమాల్లో యాక్షన్ సీన్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చాలారోజుల నుంచి ఓ యాక్షన్ అడ్వెంచర్ తీయాలని రాజమౌళి అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన స్టోరీకి మహేశ్ సరిగ్గా సెట్ అవుతాడని ఫిక్స్ అయి, అతడిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. మహేశ్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లే ఈ స్టోరీ రాశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. వచ్చే జూన్ లోపు షూట్ మొదలవ్వొచ్చు’ అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది తన ఫ్యామిలీలోని ముగ్గురు కుటుంబ సభ్యులు (తండ్రి, తల్లి, అన్నయ్య) చనిపోవడంతో మహేశ్ చాలా బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటన్నింటికీ ఎండ్ కార్డ్ వేసి.. మళ్లీ వర్క్ లో బిజీగా మారిపోనున్నారు.