లెజెండరీ తెలుగు యాక్టర్ ఘట్టమనేని కృష్ణ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమతో పాటు అశేషమైన వీరాభిమానులు ఆయన అంతిమ సంస్కారాలలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఇప్పుడు కృష్ణ అస్థికలను ఆయన తనయుడు మహేష్ బాబు.. విజయవాడలోని పవిత్ర కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు తన ఫ్యామిలీతో విజయవాడకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మహేష్ బాబుకు తోడుగా ఆయన బావలు సంజయ్ స్వరూప్, జయదేవ్, సుధీర్ బాబు, చిన్నాన్న ఆదిశేషగిరిరావు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు వచ్చారు. ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 15న గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్ర పొందుతూ కృష్ణ కన్నుమూశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో 16వ తేదీన జరిగాయి. కృష్ణ చివరిచూపు కోసం ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు భారీ స్థాయిలో అభిమానులు పాల్గొని నివాళి తెలుపుకున్నారు.
సూపర్ స్టార్ గా తెలుగు ఇండస్ట్రీని దశాబ్దాల కాలంపాటు ఏలిన కృష్ణ.. కెరీర్ లో 350కి పైగా సినిమాలలో నటించారు. అలాగే ఎన్నో సినిమాలు నిర్మించడమే కాకుండా దాదాపు 16 సినిమాలకు దర్శకత్వం వహించడం విశేషం. ఇక కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్న కృష్ణ.. వయోభారం, గుండెపోటు కారణాలతో 80వ ఏట తుదిశ్వాస విడిచారు. ఇక ఘట్టమనేని ఫ్యామిలీలో ఒకే ఏడాదిలోనే ఇది మూడో విషాదం. ఈ ఏడాదిలోనే సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణలను కోల్పోయారు మహేష్ బాబు. ఇక సోమవారం అనగా నవంబర్ 21న సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను శాస్త్రోక్తంగా పవిత్ర కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నారు మహేష్.
Mahesh Babu Reached Gannavaram Airport. pic.twitter.com/XsUzSew2Cx
— Naveen MB Vizag (@NaveenMBVizag) November 21, 2022